GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 7:32 am Digital Edition : GURU SWAMY

బైరెడ్డిపల్లి జడ్పీటీసీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం

కూటమి అభ్యర్థి సుబ్రమణ్యం శెట్టి, వైకాపా అభ్యర్థి కార్తీక్ మధ్య పోటీ

బైరెడ్డిపల్లి, గరుడదాత్రి, అక్టోబర్ 28:

బైరెడ్డిపల్లి మండలంలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తమ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మండలంలో జడ్పీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా సుబ్రమణ్యం శెట్టి, వైకాపా అభ్యర్థిగా కార్తీక్ పోటీ పడుతున్నారు.
కూటమి అభ్యర్థి సుబ్రమణ్యం శెట్టి విజయాన్ని కాంక్షిస్తూ మండల టీడీపీ అధ్యక్షుడు కిషోర్ గౌడు, కూటమి నాయకులు దిలీప్‌తో పాటు బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కానుకగా ప్రజలు ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో సుబ్రమణ్యం శెట్టి విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు వైకాపా జడ్పీటీసీ అభ్యర్థి కార్తీక్ విజయమే లక్ష్యంగా మొగశాల సోదరులు, మండల వైకాపా నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా వైకాపా నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ అభ్యర్థి విజయానికి శ్రీరామరక్షగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజలు తమ పార్టీకి మద్దతుగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
మొత్తంగా బైరెడ్డిపల్లి మండలంలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుండటంతో, ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.