GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 9:54 pm Digital Edition : GURU SWAMY

బొప్పాయి తోటపై స్వైరవిహారం చేసిన ఒంటరి ఏనుగు

చేతికొచ్చిన పంట నేలపాలు..

రైతుకు తీవ్ర నష్టం..
పది రోజులుగా ఏనుగు సంచారం..

శాశ్వత పరిష్కారం కోరుతున్న రైతులు

బైరెడ్డిపల్లి, సెప్టెంబర్ 17 (గరుడదాత్రి):

చేతికొచ్చిన బొప్పాయి పంటను మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఒంటరి ఏనుగు తోటపై దాడి చేయడంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. బైరెడ్డిపల్లి మండలంలోని కడపనత్తం అటవీ ప్రాంతానికి సమీపంలో, తమిళనాడు సరిహద్దు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
కడపనత్తం గ్రామానికి చెందిన రైతు గజేంద్ర తనకున్న వ్యవసాయ భూమిలో సుమారు ఎకరా విస్తీర్ణంలో బొప్పాయి తోటను సాగు చేస్తున్నాడు. పంట కోతకు వచ్చి మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో బుధవారం రాత్రి ఒంటరి ఏనుగు తోటలోకి ప్రవేశించింది. తోటలోని పెద్ద సంఖ్యలో బొప్పాయి మొక్కలను తొక్కి, విరిచివేసిన ఏనుగు కొంత మేర పండ్లను తిని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో చేతికొచ్చిన పంటలో గణనీయమైన భాగం దెబ్బతిని రైతుకు భారీ నష్టం వాటిల్లింది.
ఈ సందర్భంగా రైతు గజేంద్ర మాట్లాడుతూ.. ఎంతో శ్రమించి సాగు చేసిన బొప్పాయి పంట చేతికొచ్చిన సమయంలో ఏనుగు దాడి చేయడంతో తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం బొప్పాయికి మార్కెట్‌లో మంచి ధర లభిస్తున్నప్పటికీ, ఏనుగు దాడితో పంట నష్టపోవడం బాధ కలిగిస్తోందని తెలిపాడు.

-పది రోజులుగా ఏనుగు సంచారం

ఈ ప్రాంతంలో సుమారు పది రోజులుగా ఒంటరి ఏనుగు సంచరిస్తూ రైతుల పంటలపై దాడులు చేస్తోందని స్థానిక రైతులు చెబుతున్నారు. ఏనుగును మరో ప్రాంతానికి తరలించేందుకు అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. పంటలను కాపాడుకోవడంతో పాటు తమ ప్రాణాలను రక్షించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పరిహారం సరిపోవడం లేదని, పరిహారం చెల్లించి సమస్యను ముగించినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఏనుగుల సంచారం వల్ల ప్రతి ఏడాది పంటలు నష్టపోతున్నామని పేర్కొన్నారు.
ఇకనైనా బైరెడ్డిపల్లి మండలంలోని రైతుల పంటలు, ప్రాణాలను ఏనుగుల బారి నుంచి రక్షించేందుకు అటవీశాఖ అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపట్టాలని, ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.