GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 8:07 am Digital Edition : GURU SWAMY

భూ కొలతల్లో సమస్యలుంటే తహసీల్దార్‌ను సంప్రదించండి

రైతులు పరస్పరం గొడవ పడొద్దు

మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి

రాజముద్ర పాస్‌పుస్తకాల పంపిణీలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

పిచ్చాటూరు అక్టోబర్ 7 గరుడధాత్రి :

✍రైతుల సౌలభ్యం కోసమే ప్రభుత్వం భూములను పక్కాగా సర్వే చేసి రాజముద్రతో కూడిన ఈ-పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తోందని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. బుధవారం మండలంలోని రామాపురం, పులికుండ్రం సచివాలయాల పరిధిలో తహసీల్దార్‌ చంద్రబాబు అధ్యక్షతన ఈ-పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో భూముల కొలతలు నమోదు చేశారని, సాంకేతికత అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో ఆధునిక పద్ధతుల్లో పక్కాగా కొలతలు వేసి రికార్డుల్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో భూమి కొలతల్లో ఏవైనా చిన్నచిన్న మార్పులు, అటు ఇటుగా ఉన్నట్లు గమనిస్తే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భూ సరిహద్దుల విషయంలో రైతులు ఒకరితో ఒకరు గొడవ పడకుండా.. ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
ఆర్థికంగా బలపడాలి..
మహిళా సాధికారత కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు. ఇందులో భాగంగానే వెలుగు మహిళా సమాఖ్య ద్వారా మహిళా సంఘాలకు ప్రభుత్వం విరివిగా రుణాలు మంజూరు చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడివో
మహమ్మద్ రఫీ, ఎంఈవో 2 యుగదర్ రాజు,మాజీ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ ఇళంగోవన్‌ రెడ్డి, రామచంద్రరాజు, మాజీ సర్పంచి దిలీప్‌, వీఆర్వోలు రఘు, జానకిరామ్‌,రైతులు పాల్గొన్నారు