GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 8:50 pm Digital Edition : GURU SWAMY

మత్తు వద్దు… ఆట ముద్దు -పోలీసుల మధ్య క్రికెట్ పోటీ

పిచ్చాటూరు, ఆగస్టు 16 గరుడధాత్రి:

యువతను గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి క్రీడల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో “మత్తు వద్దు… ఆట ముద్దు” అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పుత్తూరు రూరల్ సర్కిల్ పోలీసులు, సత్యవేడు సర్కిల్ పోలీసుల మధ్య ఆరోగ్యకరమైన క్రికెట్ పోటీని పిచ్చాటూరులోని ఐసీసీ గ్రౌండ్‌లో నిర్వహించారు.
ఈ పోటీలో పుత్తూరు రూరల్ సర్కిల్ జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. ఇరు జట్లకు చెందిన పోలీసులు స్నేహపూర్వక వాతావరణంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా పోటీలో పాల్గొన్నారు. సత్యవేడు సర్కిల్ జట్టుకు సునీల్, పుత్తూరు రూరల్ సర్కిల్ జట్టుకు బి. రాఘవేంద్ర కెప్టెన్లుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఏకాగ్రతకు దోహదపడతాయని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని గ్రామాభివృద్ధికి యువత తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ క్రికెట్ పోటీని మండల ప్రజలు, యువత ఆసక్తిగా వీక్షించారు. సత్యవేడు, పుత్తూరు రూరల్ సర్కిల్ పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని “మత్తుకు దూరం… క్రీడలకు దగ్గరం” అనే సందేశాన్ని యువతకు అందించారు.