GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 4:00 pm Digital Edition : GURU SWAMY

మన్నారుపోలూరు ప్రభుత్వ పాఠశాలకు రూ.42 లక్షలతో మౌళిక వసతుల కల్పన

– శ్రీసిటీ ఐసాన్ పరిశ్రమ చేయూత

సత్యవేడు, ఆగస్టు 06 గరుడధాత్రి :

శ్రీసిటీ ఫౌండేషన్ సహకారంతో శ్రీసిటీకి చెందిన ఐసాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తమ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చేపట్టిన మౌళిక వసతుల అభివృద్ధి పనులను గురువారం ప్రారంభించింది.
సుమారు రూ.42 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో నూతన గ్రంథాలయ భవన నిర్మాణం, తరగతి గదుల మరమ్మతులు, ఆర్వో తాగునీటి ప్లాంట్, సేఫ్టీ గ్రిల్స్, ఫర్నిచర్ ఏర్పాటు, పాఠశాల ప్రాంగణంలో పచ్చదనం పెంపు వంటి పనులు చేపట్టారు.
ఐసాన్ ఇండస్ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ యసునోరి సకౌయే, ప్లాంట్ హెడ్ యుయిచా టోమిటా, శ్రీసిటీ ఫౌండేషన్ డైరెక్టర్ (సీఎస్‌ఆర్) నిరీషా సన్నారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్.కుమార్ కార్యక్రమంలో పాల్గొని, నూతనంగా నిర్మించిన వసతులను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా యసునోరి సకౌయే మాట్లాడుతూ, శ్రీసిటీ పరిసర ప్రాంతాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ కార్యక్రమాల ద్వారా తమ సంస్థ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకుని సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు.
ఐసాన్ సీఎస్సార్ చర్యలను అభినందించిన నిరీషా సన్నారెడ్డి, పరిశ్రమల భాగస్వామ్యంతో శ్రీసిటీ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులను మెరుగుపరుస్తూ విద్యార్థుల నమోదు, విద్యా ఫలితాల పెరుగుదలకు కృషి చేస్తోందని చెప్పారు. భవిష్యత్తులో కూడా విద్య, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
స్కూల్ కు పలు వసతులు సమకూర్చిన ఐసాన్ సంస్థను జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్.కుమార్ అభినందించారు. అలాగే సత్యవేడు, వరదయ్యపాలెం, సూళ్లూరుపేట, తడ మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి శ్రీసిటీ ఫౌండేషన్, పరిశ్రమలు చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. తమ పాఠశాలకు వసతుల కల్పన పట్ల ఐసాన్ సంస్థకు, శ్రీసిటీకి ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతుల ప్రదానం, మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు.
ఐసాన్ పరిశ్రమ ప్రొడక్షన్ కోఆర్డినేటర్ తొషిహిరో సనో, హెచ్ఆర్ జనరల్ మేనేజర్ గోపాల్, జనరల్ మేనేజర్ (మ్యానుఫ్యాక్చరింగ్) దేవనాదన్, స్కూల్ టీచర్లు, విద్యార్థులు, శ్రీసిటీ ఫౌండేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.