*భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి*
*టిటిడి పాసులు ఉన్నవారికి మాత్రమే పూజకు అనుమతి*
పలమనేరు, ఆగస్టు 11 ( గరుడ ధాత్రి ) :
ఈనెల 14న పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమ ఏర్పాట్లపై పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి మంగళవారం అధికారులు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. సుమారు 2,000 మంది భక్తులు పాల్గొననున్న ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి టిటిడి ఆధ్వర్యంలో జారీ చేసిన పాసులు ఉన్నవారిని మాత్రమే పూజకు అనుమతించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, అగ్నిప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో డీఎస్పీ డేగల ప్రభాకర్, సీఐలు మోహన్ రెడ్డి, పరశురాముడు, మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ, ట్రాన్స్ కో ఏడి జీవన్ కుమార్ రెడ్డి, ఫైర్ మెన్ యునుస్, హెడ్ కానిస్టేబుల్ రెడ్డెప్ప రెడ్డి, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.