GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 10:17 pm Digital Edition : GURU SWAMY

మానవ–ఏనుగు సంఘర్షణ నివారణపై రైతులకు ప్రాయోగిక శిక్షణ

పలమనేరు, ఆగస్టు 19 గరుడధాత్రి :
పలమనేరు రేంజ్ పరిధిలోని అటవీ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న రైతులకు, మానవ-ఏనుగు సంఘర్షణల నివారణపై ఈ రోజు ఒక ప్రత్యేక ప్రాయోగిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. స్థానికంగా, తక్కువ ఖర్చుతో లభించే సాంకేతిక వనరులను ఉపయోగించి ఏనుగుల దాడుల నుండి ప్రాణ, పంట నష్టాలను ఎలా అరికట్టవచ్చో ఈ కార్యక్రమంలో సవివరంగా వివరించారు. బెంగళూరు నుండి విచ్చేసిన నిపుణులు రుద్రాదిత్య ఉదయం మరియు సాయంత్రం వేళల్లో రైతులకు క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష శిక్షణ అందించారు. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్న సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, గ్రామాల్లో సులభంగా లభించే వస్తువులతో తక్కువ ఖర్చుతో అమలు చేయగల ఆచరణాత్మక నివారణ చర్యలను ఆయన విడమర్చి చెప్పారు. శిక్షణకు అవసరమైన వివిధ పరికరాలు మరియు సామగ్రిని రుద్రాదిత్య స్వయంగా సమకూర్చి కార్యక్రమానికి అందించారు. ఈ ప్రత్యక్ష శిక్షణ ద్వారా రైతులకు ఏనుగుల బెడదను వ్యవహారికంగా ఎదుర్కోవడంలో మరియు సంఘర్షణను తగ్గించడంలో ఎంతో అవసరమైన పరిజ్ఞానం లభించింది. పలమనేరు రేంజ్ పరిధిలోని రైతులకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా నిలిచిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వో చంప్ల నాయక్, సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.