GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 12:04 pm Posted by : GARUDA DHATRI NEWS

మిథున లగ్నంలో దివ్యంగా ప్రారంభమైన శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మిథున లగ్నంలో దివ్యంగా ప్రారంభమైన శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

వేదఘోషలు, గోవింద నామస్మరణల నడుమ ఘనంగా ధ్వజారోహణం

ముక్కోటి దేవతలకు ఆహ్వానంగా ధ్వజారోహణ మహోత్సవం

ఆధ్యాత్మిక శోభతో ముస్తాబైన తిరుపతి – బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

పెద్దశేష వాహనంపై భక్తులను కటాక్షించనున్న శ్రీ గోవిందరాజస్వామి

గరుడధాత్రి న్యూస్ :
వేదఘోషలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం మిథున లగ్నంలో ధ్వజారోహణ మహోత్సవంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7.35 నుండి 8.49 గంటల మధ్య గరుడ చిత్రంతో అలంకరించిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించి బ్రహ్మోత్సవాలకు శుభారంభం పలికారు. అనంతరం స్వామివారి ఆస్థానం ఘనంగా నిర్వహించారు.
అంతకుముందు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు వెండి తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఈ దివ్య ఊరేగింపుతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారే స్వయంగా పర్యవేక్షిస్తారనే ఆధ్యాత్మిక విశ్వాసం భక్తులను అలరించింది.
అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి 18 గణాలు, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
తదనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో అభిషేకాలు నిర్వహించగా భక్తులు భక్తి పరవశులయ్యారు.
సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనసేవ వైభవంగా జరుగనుంది. పెద్దశేష వాహనంపై స్వామివారు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు, వైట్ పెయింటింగ్‌, రంగవల్లులు, విద్యుత్ దీపాలంకరణలు, ఆకర్షణీయ పెయింటింగ్స్‌, పుష్పాలంకరణలతో ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక శోభతో తీర్చిదిద్దింది.
అదేవిధంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయరావు, శ్రీ రంజిత్ , అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.