GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 1:46 pm Digital Edition : GURU SWAMY

ముమ్మరంగా యాంటీ లార్వల్, ఫీవర్ సర్వేలు

పలమనేరు, అక్టోబర్ 07 ( గరుడ ధాత్రి ) :
దోమల నివారణ మరియు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలమనేరు సబ్ యూనిట్ ఆఫీసర్ జయశంకర్ సూచించారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం కాకాతోపు యూపీహెచ్‌సీ పరిధిలోని వినాయక్ నగర్‌లో వైద్య సిబ్బంది యాంటీ లార్వల్, ఫీవర్ సర్వేలను ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డెంగ్యూ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు ఇంటింటికీ తిరిగి విస్తృత అవగాహన కల్పించారు. ప్రధానంగా ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ.. ప్రతి శుక్రవారం ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని పారబోసి, పాత్రలను ఆరబెట్టడం ద్వారా దోమల లార్వాలు, గుడ్లను నాశనం చేయవచ్చని వైద్య సిబ్బంది సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో ఇంటి పరిసరాల్లోని పనికిరాని డబ్బాలు, పాత టైర్లు, పగిలిన కుండలు మొదలైన వాటిలో వర్షపు నీరు చేరకుండా చూసుకోవాలని హెచ్చరించారు. దోమల బెడద నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి కిటికీలకు మెస్సులు (తెరలు) బిగించాలని, సాయంత్రం వేళల్లో దోమలు లోపలికి రాకుండా తలుపులు మూసి ఉంచాలని కోరారు. అలాగే దోమలు కుట్టకుండా ఉండేందుకు వీలుగా నిండు చేతుల (పొడవు) చొక్కాలు ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది అనిలా, యరపరెడ్డి, బలరాం, ఆశా కార్యకర్త లత తదితరులు చురుగ్గా పాల్గొన్నారు.