GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 10:27 am Posted by : GURU SWAMY

మురుగు నుండి మోక్షం ఎప్పుడో?

-రోడ్లపై డ్రైనేజీ మురుగు నీరు.. గ్రామస్తుల ఆందోళన

గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండలం, తొండంబట్టు పంచాయతీ పరిధిలోని నాగనందపురం గ్రామంలో డ్రైనేజీ సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. గ్రామంలోని పలు వీధుల్లో మురుగు నీరు రోడ్లపైకి పొంగిపొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామ అభివృద్ధికి ప్రతీకగా నిలవాల్సిన నాగనందపురం ప్రస్తుతం మురుగు నీటి సమస్యతో సతమతమవుతోంది. రోడ్లపై నిలిచిపోయిన మురుగు నీటిలోనే గ్రామస్తులు నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
మురుగు నీటి కారణంగా దుర్వాసన వ్యాపించడంతో పాటు దోమల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే డ్రైనేజీ వ్యవస్థను సరిచేసి, మురుగు నీటి సమస్యకు పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
“మురుగు నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరం. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలి” అని గ్రామస్తులు కోరుతున్నారు.