GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 4:04 am Digital Edition : GURU SWAMY

మూడో ఎంపీటీసీ సెగ్మెంట్‌లో మురళి ప్రచార హోరు..!

టిడీపీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ.. ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన

సత్యవేడు, గరుడధాత్రి న్యూస్:

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో సత్యవేడు మండలంలో రాజకీయ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో చివరి రోజు మంగళవారం సత్యవేడు పట్టణంలోని మూడో ఎంపీటీసీ సెగ్మెంట్ టీడీపీ అభ్యర్థి మురళి (చికెన్ చిన్న) ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు.
టీడీపీ మండల అధ్యక్షుడు శివకుమార్ నాయుడు, కూరపాటి మురళిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితర నాయకులతో కలిసి జడ్పీటీసీ అభ్యర్థి సోనియా, ఎంపీటీసీ అభ్యర్థి మురళి భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని గాంధీ రోడ్డు, జయరాం భక్తుడు వీధి, పల్లపు వీధి, నేతాజీ రోడ్డు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని అభ్యర్థులు సోనియా, మురళి పేర్కొన్నారు. పరిశ్రమల రాకతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.
నవంబర్ 5న జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలని మూడో ఎంపీటీసీ సెగ్మెంట్ అభ్యర్థి మురళి (చికెన్ చిన్న) ఓటర్లను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు పరమశివం, చిన్న ఈటిపాకం మాజీ సర్పంచ్ గోవిందస్వామి, నాయకులు మునికుమార్ రెడ్డి, సంతోష్ కుమార్ నాయుడు, సునీల్ జైన్, శివయ్య, శివానందం, కృష్ణయ్య యాదవ్, మాజీ సర్పంచులు రూబెన్, శంకరయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు.