GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 7:12 pm Posted by : GARUDA DHATRI NEWS

రాయ‌ల‌సీమ‌లో జ‌న‌సేన బ‌లోపేతం ల‌క్ష్యం – మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్

రాయ‌ల‌సీమ‌లో జ‌న‌సేన బ‌లోపేతం ల‌క్ష్యం – మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్
స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో వంద‌శాతం స్ట్రియిక్ రేట్ సాధించాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై జ‌న‌సేన పార్టీ ఉమ్మ‌డి చిత్తూరు, క‌డ‌ప జిల్లాల పిఓసిలు, ముఖ్య‌నాయ‌కుల‌తో
ఆ పార్టీ స్థానిక సంస్థ‌ల ఎన్నికలు, డిలిమిటేషన్ కమిటీ సభ్యులైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు, అహుడా ఛైర్మ‌న్ టిసి వ‌రుణ్ లు శ‌నివారం ఓ ప్రైటేట్ హోట‌ల్ లో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లో భాగంగా మున్సిప‌ల్ కార్పోరేష‌న్, మున్సిపాల్టీలు, న‌గ‌ర పంచాయితీల్లో జ‌రుగుతున్న వార్డులు, డివిజ‌న్ ల డిలిమిటేష‌న్ పై చ‌ర్చించారు. జ‌న‌సేన బ‌లంగా ఉండే వార్డులు, డివిజ‌న్ లు గుర్తించాల‌ని వాటిలో ఎమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే వాటి వివ‌రాల‌ను క‌మిటికి అందించాల‌ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తెలిపారు. డిలిమిటేష‌న్ పై పూర్తి వివరాలను ఆయా ప్రాంత నాయ‌కులు 13వ తేది లోపు క‌మిటీకి పంపాల‌ని ఆయ‌న కోరారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల రిజ‌ర్వేష‌న్ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన నాడే జ‌న‌సేన పోటీ చేసే స్థానాల‌ను ప్ర‌క‌టించేలా అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆయ‌న చెప్పారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై నివేదిక స‌మ‌ర్ఫ‌ణ‌కు ఇచ్చిన స‌మ‌యం త‌క్కువుగా ఉంద‌ని పొడిగింపు విష‌యం జ‌న‌సేన అధ్య‌క్షులైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్ఠికి తీసుకెళ్ళ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతం అర్బ‌న్ ప్రాంతాల‌పైన మాత్ర‌మే క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌ని త్వ‌ర‌లో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా మండ‌లాల్లో ప‌ర్య‌టించి ఎంపిటీసి, జెడ్ పి టీసి స్థానాల్లో జ‌న‌సేన ఎక్క‌డ బ‌లంగా ఉంది, ఎవ‌రు పోటీ చేయాల‌నే అంశాల‌తో నివేదిక సిద్ధం చేసి అధిష్టానానికి అందిస్తామ‌ని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఎన్డీఏ కూట‌మిలో ఏ పార్టీ ఏఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనేది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బిజేపి రాష్ట్ర అధ్య‌క్షుల భేటిలో తేలుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ఆదివారం అనంత‌పురంలో స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. రాయ‌లసీమ‌లో జ‌న‌సేన పార్టీని బ‌లోపేతం చేయ‌డం త‌మ లక్ష్య‌మ‌ని ఆయ‌న తెలిపారు. జ‌న‌సేన పార్టీలో గ్రూపులు వీడి అందురూ ఐక్యంగా ఉంటేనే కూట‌మి ఎమ్మెల్యేలు పార్టీ నాయ‌కులకు విలువ ఇస్తార‌ని ఆయ‌న చెప్పారు. కాగా ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన సాధించిన వంద‌శాతం స్ట్ర‌యిక్ రేట్ ను స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సాధించేందుకు ఈ సమావేశం తొలిమెట్టుకావాల‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశ‌యాల‌కు అనుగుణంగా ఐక్యంగా అందురూ ప‌ని చేస్తే జ‌న‌సేన చ‌రిత్ర‌ను స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో తిర‌గరాస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. డిలిమిటేష‌న్ లో భాగంగా కొత్త వార్డులు, డివిజ‌న్ ల‌లో జ‌న‌సేన పార్టీ ఖ‌చ్చితంగా గెలిచే స్థానాల‌ను గుర్తించ‌డంతోపాటు స‌రైన అభ్య‌ర్థుల‌ను సూచిస్తే బాగుంటుంద‌ని ఆయ‌న నాయ‌కుల‌ను కోరారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌నతో న‌డిచిన వారికి నామినేటెడ్ ప‌ద‌వుల్లో ప్రాధాన్య‌త ఇచ్చారని ఆయ‌న తెలిపారు. కావున పార్టీ కోసం క‌ష్ట‌ప‌డే వారికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ న్యాయం చేస్తార‌న్న భ‌రోసా క‌లిగింద‌ని ఆయ‌న చెప్పారు. భోజ‌న విరామం త‌రువాత ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా పిఓసిలు, ముఖ్య‌నేత‌ల‌తో క‌మిటీ స‌భ్యులు భేటి అయ్యారు. ఈ భేటిలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జ‌న‌సేన బ‌లంగా ఉన్న డివిజ‌న్స్, వార్డుల‌పై పిఓసీలు క‌మిటీ దృష్టికి తీసుకురాగా రాత‌పూర్వ‌కంగా ఇవ్వాల‌ని క‌మిటీ స‌భ్యులు సూచించారు. అనంత‌రం ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాపై స‌మీక్ష జ‌రిగింది. ఈ స‌మీక్ష‌లో మున్సిప‌ల్ కార్పోరేష‌న్, మున్సిపాల్టీల్లో జ‌న‌సేన బ‌లాబలాల‌పై చ‌ర్చించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, డిలిమిటేష‌న్ పై పూర్తి స్థాయిలో వివ‌రాలు ఈనెల 13వ తేది లోపు అందించాల‌ని క‌మిటీ స‌భ్యులు ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్తూరు ఉమ్మ‌డి జిల్లా అధ్య‌క్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, క‌డ‌ప జిల్లా కో ఆర్డినేట‌ర్ సుంకర శ్రీనివాస్, రాందాస్ చౌదరి, రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.