కుప్పం,సెప్టెంబర్ 24 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి):
వర్షాల కారణంగా వస్తున్న ప్రవాహాలతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్ని నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు పరిధిలో ఉన్న వివిధ నీటి వనరుల్ని కూడా నింపాలని స్పష్టం చేశారు. గురువారం రియల్టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగం, డేటా అనలిటిక్స్, ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్ష ప్రభావంపై సీఎం చర్చించారు. తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో గడచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూగర్భజలాలు కొంత మేర పెరిగాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రకాశం బ్యారేజి సహా మున్నేరు సహా ఇతర క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని అన్నారు.ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితులను మార్చడం సాధ్యం కాకపోయినా వాటి ప్రభావాన్ని తగ్గించేలా అంతర్గత పరిస్థితులను మార్చుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భూసారాన్ని పెంచడం, సాయిల్ టెస్టింగ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, బయోచార్, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో పైలట్గా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి అవసరమైన సూచనలు అందించేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సీఎం సూచించారు.ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలు, గాలుల తీవ్రత, నదులు-వాగుల్లో పెరుగుతున్న ప్రవాహాలు, రిజర్వాయర్లలోకి చేరుతున్న వరద నీరు, రాబోయే రోజుల్లో అంచనా వేసిన వర్షపాతంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. తాజా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావంతో గోదావరి బేసిన్లోని శబరి, ఇంద్రావతి, ఏలేరు, తాండవ, ఎర్రకాల్వ, పంపా, మేఘాద్రిగడ్డ తదితర రిజర్వాయర్లకు భారీగా వరద నీరు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏలేరు రిజర్వాయర్కు 21,200-26,500 క్యూసెక్కులు, 6,000-7,500 క్యూసెక్కులు, మేఘాద్రిగడ్డకు 2,400- 3,000 క్యూసెక్కులు, పంపాకు 3,100–3,875 క్యూసెక్కులు వరకు ఇన్ఫ్రా వస్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రాజెక్టుల దిగువన ఉన్న అన్ని నీటి వనరుల్లో వర్షపు నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైన చోట మోటార్లను వాడి నీటిని లిఫ్ట్ చేయాలని స్పష్టం చేశారు. గోదావరి నుంచి వస్తున్న ప్రవాహాల ద్వారా 24 టీఎంసీల నీటిని ఏలేరు రిజర్వాయర్ నింపాలని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకూ నీటి వనరుల్లోకి నీటిని పంపాలన్నారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వర్షాలు అధికంగా నమోదు అయ్యాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ సహా వివిధ జిల్లాల్లో తీవ్ర వర్ష ప్రభావం కనిపించిందని తెలిపారు.