GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 5:07 pm Posted by : GURU SWAMY

రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణం -దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

గరుడధాత్రి : రాష్ట్రంలో రాబోయే మూడు సంవత్సరాల్లో శ్రీవాణి ట్రస్టు ద్వారా 5 వేల ఆలయాల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు.
ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థల విస్తీర్ణాన్ని బట్టి నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి వివరించారు. పది సెంట్లలోపు స్థలం ఉంటే రూ.20 లక్షలు, 15 సెంట్ల స్థలం ఉంటే రూ.30 లక్షలు, 20 సెంట్ల స్థలం ఉంటే రూ.40 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు.
నిర్మించాల్సిన ఆలయం రామాలయమా, శివాలయమా, అమ్మవారి దేవాలయమా అనే అంశాన్ని స్థానిక ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. తమ నియోజకవర్గాల్లో ఆలయ నిర్మాణాలకు అనువైన ప్రాంతాలను గుర్తించి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.
అలాగే జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ భూములు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో గుర్తించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించడంతో పాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు.