GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 7:18 pm Digital Edition : GURU SWAMY

రూ.190.89 కోట్లతో తిరుపతిలో 18.5 కి.మీ. మాస్టర్ ప్లాన్ రోడ్లు

ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం

నాణ్యతలో రాజీపడొద్దు.. పనులను స్వయంగా పర్యవేక్షిస్తా: తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి సెప్టెంబర్ 27 గరుడధాత్రి :

తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా తుడా కీలక ప్రణాళికను చేపడుతోంది. సుమారు రూ.190.89 కోట్ల అంచనా వ్యయంతో 18.5 కిలోమీటర్ల మేర 8 మాస్టర్ ప్లాన్ బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్‌అఫిషియో సభ్యుడు, టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు.

తుడా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులతో కలిసి ప్రతిపాదిత రహదారి మార్గాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలు, విస్తరిస్తున్న నగర పరిధిని దృష్టిలో ఉంచుకుని 60, 80, 100 అడుగుల వెడల్పుతో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

తిరుపతితో పాటు చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాలను అనుసంధానించేలా రోడ్ల నెట్‌వర్క్‌ను రూపొందించినట్లు దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రహదారులు అందుబాటులోకి వస్తే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని తెలిపారు.

రూ.190.89 కోట్లతో చేపట్టే ప్రధాన రోడ్లు

* శెట్టిపల్లి టౌన్‌షిప్ (ఎరుకులబాట) పరిధిలో 150 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు నుంచి రూ.8.89 కోట్లతో 60 అడుగుల బీటీ రోడ్డు.

* శెట్టిపల్లి టౌన్‌షిప్ నుంచి NH-71 దామినేడు జంక్షన్ వరకు రూ.19.10 కోట్లతో 100 అడుగుల బీటీ రోడ్డు.

* కరకంబాడి రోడ్డు నుంచి శెట్టిపల్లి టౌన్‌షిప్ వరకు రూ.12.89 కోట్లతో 100 అడుగుల బీటీ రోడ్డు.

* అదే మార్గంలో రూ.12.56 కోట్లతో 80 అడుగుల బీటీ రోడ్డు.

* NH-71 నుంచి కోట్రమంగళం రోడ్డు (మార్గ్ రోడ్డు) వరకు రూ.24.45 కోట్లతో 80 అడుగుల బీటీ రోడ్డు.

* ఐతేపల్లి–రంగంపేట మీదుగా NH-140, NH-71లను అనుసంధానిస్తూ రూ.49 కోట్లతో 100 అడుగుల మాస్టర్ ప్లాన్ బీటీ రోడ్డు.

* కోర్టు కాంప్లెక్స్ రోడ్డు జంక్షన్ నుంచి తిరుచానూరు పరిధిలోని పూడి రోడ్డు జంక్షన్ వరకు రూ.44 కోట్లతో 100 అడుగుల బీటీ రోడ్డు.

* తిరుపతి NH-71 నుంచి కోర్టు కాంప్లెక్స్ రోడ్డు జంక్షన్ వరకు రూ.20 కోట్ల అంచనా వ్యయంతో 100 అడుగుల బీటీ రోడ్డు.

ఈ పనులన్నింటినీ నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తుడా ఛైర్మన్ తెలిపారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించిన ఆయన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పనులు చేపట్టాలని సూచించారు. పనుల పురోగతిని తానే స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని తెలిపారు.

ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు, గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడి, భవిష్యత్ నగర విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా. ఎన్.వి. శ్రీకాంత్ బాబు, ఎస్‌ఈ రవీంద్రయ్య, సీపీఓ దేవికుమారి, భూసేకరణ అధికారి సుజన, జేపీఓలు, ఏపీఓలు, ఇతర తుడా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.