GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 7:32 am Digital Edition : GURU SWAMY

రెండేళ్లైనా అమలు కాని హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బాలాజీ రెడ్డి..!

సత్యవేడు జూన్ 05 గరుడధాత్రి :
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు గడిచినా అమలు చేయలేదని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు గురువారం సత్యవేడులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏవియం బాలాజీ రెడ్డి పాల్గొని ప్రభుత్వ విధానాలను విమర్శించారు.
ఈ సందర్భంగా బాలాజీ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు భృతి అందిస్తామని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి వేతనాలు పెంచుతామని చెప్పి, అనంతరం వారిని విధుల నుంచి తప్పించడం జరిగిందని ఆరోపించారు. సచివాలయ వ్యవస్థ పనితీరు కూడా బలహీనపడిందన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల మంజూరులో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బెల్ట్ రమేష్, ఎంపీ రవి, మస్తానీ బేగం, కృష్ణయ్య, మహేష్, మణి, శ్రీధర్ రెడ్డి, షాబుద్దీన్, పలని, రాహుల్, ఇస్మాయిల్, ఆనంద్, సుధాకర్, భాస్కర్, బాలాజీ, వెంకటేష్, జానకిరామ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఆనంద్ రెడ్డి, పునీత్ కుమార్ రెడ్డి, కొండస్వామి, బాలాజీ శేఖర్, రామన్న తదితరులు పాల్గొన్నారు.