బొలెరో వాహనంతో సహా 61 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
ఇద్దరిపై కేసు నమోదు
కేవీబీపురం, గరుడధాత్రి న్యూస్:
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి చేరకుండా తిరుపతి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వం చౌక ధరలకు అందిస్తున్న బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాలపై నిఘా ముమ్మరం చేసిన పోలీసులు.. కేవీబీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
కేవీబీపురం ఎస్ఐ ఓబయ్య తన సిబ్బందితో కలిసి నిర్వహించిన తనిఖీల్లో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 61 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం మేరకు.. నాయుడుపేటకు చెందిన వాహన యజమాని అమాస సురేష్, డ్రైవర్ వంశీ కలిసి నాగలాపురం–పిచ్చాటూరు మార్గం మీదుగా కేవీబీపురం వైపు నుంచి వెంకటగిరికి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా 61 బస్తాల రేషన్ బియ్యం బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు.
పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, అధిక ధరలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో వాహన యజమాని అమాస సురేష్, డ్రైవర్ వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ఓబయ్య వెల్లడించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గండికొట్టేలా రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఓబయ్య హెచ్చరించారు. అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.