GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 2:57 pm Posted by : GURU SWAMY

రైతు పక్షపాతిగా నిలిచిన ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి

పలమనేరు పట్టుగూళ్ళ మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీ

వ్యాపారుల వివరాలను డిస్‌ప్లేలో పెట్టాలని ఆదేశం

రైతులకు కచ్చితంగా రసీదులు ఇవ్వాలని అధికారులకు అల్టిమేటం

-ఎమ్మెల్యే చొరవపై రైతుల్లో హర్షం

​పలమనేరు, జూన్ 18 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు పట్టుగూళ్ళ విక్రయ కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్‌కు పట్టుగూళ్ళను తీసుకొస్తున్న రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని, అధికారుల ఉదాసీన వైఖరి వల్లే తాము నష్టపోతున్నామంటూ రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. స్వయంగా మార్కెట్‌ను సందర్శించి, అక్కడ జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను, లూప్‌హోల్స్‌ను పరిశీలించారు. ​అధికారుల వైఖరిపై వ్యాపారస్థులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. ​మార్కెట్ నిర్వహణలో అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేశారు. కష్టపడి పంట పండించి మార్కెట్‌కు తెచ్చే రైతుకు సరైన ధర దక్కకపోవడానికి అధికారుల పర్యవేక్షణా లోపమే కారణమని గుర్తించారు. వ్యాపారుల సిండికేట్‌గా మారి రైతులకు అన్యాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని అది జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆదేశించారు. ​”రైతు రెక్కల కష్టాన్ని దోచుకుంటే ఊరుకునేది లేదని,పట్టు రైతులకు ప్రతి పైసా గిట్టుబాటు ధర దక్కేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ​రైతులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు మరియు దళారుల దోపిడీని అరికట్టేందుకు ​పట్టుగూళ్ళు కొనుగోలు చేసే వ్యాపారస్థుల పూర్తి వివరాలను, వారి లైసెన్స్ నంబర్లను మార్కెట్ ఆవరణలోని డిస్‌ప్లే బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలన్నారు . దీనివల్ల ఏ వ్యాపారి ఎంత ధరకు కొంటున్నాడో రైతులకు స్పష్టత వస్తుందన్నారు. అదేవిధంగా మార్కెట్‌కు పట్టుగూళ్ళను తీసుకొచ్చే ప్రతి రైతుకు వారు విక్రయించిన సరుకు బరువు, ధర మరియు మొత్తం విలువతో కూడిన అధికారిక రసీదులను తప్పకుండా అందజేయాలని సూచించారు. ఈ-ట్రేడింగ్ లేదా వేలం ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, రైతులకు గరిష్ట గిట్టుబాటు ధర లభించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఇలా ఉండగా ​సమస్య తెలిసిన వెంటనే స్పందించి, మార్కెట్‌కు వచ్చి అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి చొరవపై పలమనేరు నియోజకవర్గ పట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతోనైనా మార్కెట్‌లో పారదర్శకత పెరుగుతుందని, తమకు న్యాయం జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై మార్కెట్‌లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిరంతర నిఘా ఉంచాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలమనేరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రసాద్ నాయుడు, గిరిధర్ గోపాల్, శ్రీనివాసులు మరియు పట్టు పరిశ్రమ శాఖా అధికారులు, సిబ్బంది ఉన్నారు.