GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 9:28 pm Digital Edition : GURU SWAMY

వరుసగా రెండోసారి సత్తా చాటిన పీపీఎస్

జిల్లా ఉత్తమ స్వచ్ఛంద సంస్థగా పలమనేరు పరిరక్షణ సమితి

‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026’లో అరుదైన గుర్తింపు

పలమనేరు, అక్టోబర్ 02 ( గరుడ ధాత్రి ) : ప్రజా సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవే లక్ష్యంగా తొమ్మిదేళ్లుగా సేవలందిస్తున్న పలమనేరు పరిరక్షణ సమితి (పీపీఎస్) మరోసారి జిల్లా స్థాయిలో సత్తా చాటింది. ‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026’లో వరుసగా రెండో సంవత్సరం జిల్లా స్థాయి ఉత్తమ స్వచ్ఛంద సంస్థగా ఎంపికై ప్రత్యేక గుర్తింపు పొందింది. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్తూరులోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా పీపీఎస్ అధ్యక్షుడు టి. నరసింహులు, ప్రధాన కార్యదర్శి వి. నారాయణ, సమితి కార్యవర్గ సభ్యులు ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ.., పలమనేరు పట్టణ ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా గత తొమ్మిదేళ్లుగా నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. పట్టణంలోని సమస్యలను గుర్తించి ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు అవసరమైన సందర్భాల్లో అర్హులైన వారికి ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై అవగాహన, సామాజిక సమస్యలపై స్పందన, ప్రజాహిత కార్యక్రమాల నిర్వహణతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించడం పీపీఎస్ ప్రధాన లక్ష్యాల్లో భాగమని తెలిపారు. ప్రజల సహకారంతో తొమ్మిదేళ్లుగా సాగుతున్న తమ సేవా ప్రయాణానికి వరుసగా రెండో సంవత్సరం జిల్లా స్థాయి గుర్తింపు లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

సేవకు దక్కిన సముచిత గుర్తింపు : ఆనందబాబు

పలమనేరు పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షుడు, ఏపీఎన్జీజీఓస్ అసోసియేషన్ పలమనేరు తాలూకా అధ్యక్షుడు కె. ఆనందబాబు ఈ సందర్భంగా పీపీఎస్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులను అభినందించారు.“తొమ్మిదేళ్లుగా ఎలాంటి స్వార్థం లేకుండా పలమనేరు ప్రజల కోసం పీపీఎస్ చేస్తున్న సేవలకు ఈ అవార్డు సముచిత గుర్తింపు. వరుసగా రెండో సంవత్సరం జిల్లా ఉత్తమ స్వచ్ఛంద సంస్థగా ఎంపిక కావడం సమితి సభ్యుల సమష్టి కృషికి నిదర్శనం. ఇదే స్ఫూర్తితో పలమనేరు అభివృద్ధి, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పీపీఎస్ మరింత చురుగ్గా పనిచేస్తుంది” అని ఆనందబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.