GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 6:49 pm Posted by : GARUDA DHATRI NEWS

వరుస చోరీ కేసుల్లో నిందితుడు అరెస్టు

-23 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి, బైక్ స్వాధీనం

సత్యవేడు, మే 29 గరుడధాత్రి :

తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 23 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం సత్యవేడు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సై సాయినాథ్ చౌదరి నిందితుడిని మీడియా ముందుకు తీసుకువచ్చి వివరాలను వెల్లడించారు.
పోలీసుల కథనం మేరకు… సత్యవేడు మండలం కాలమనాయుడుపేట పంచాయతీ గాంధీపురంలో నివాసం ఉంటున్న హిమయ వర్మ ఇంటిలో ఈ నెల 17వ తేదీన పట్టపగలే చోరీ జరిగింది. గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటిలో చోరీ జరిగినట్లు గుర్తించి సత్యవేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మే 18న కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
స్థానిక సీఐ మురళి నాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు మే 28న చెన్నై మార్గంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో గాంధీపురం చోరీ కేసుకు సంబంధించి నిందితుడు మధనంబేడు గ్రామానికి చెందిన మణి కుమారుడు గోవర్ధన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.
అంతేకాకుండా నాగలాపురంలో ఒక ద్విచక్ర వాహన చోరీ, కారణి గ్రామంలో ఇంట్లో చొరబడి మూడు గ్రాముల బంగారం అపహరించిన ఘటనల్లో కూడా గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు.
ఈ క్రమంలో నిందితుడి నుంచి సుమారు రూ.4.50 లక్షల విలువైన 23 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గత రెండేళ్లుగా నిందితుడు వివిధ ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడులోని పాదిరివేడు, శ్రీసిటీ, మధనంబేడు, వీఆర్ కండ్రిగ ప్రాంతాల్లో నమోదైన చోరీ కేసుల్లో కూడా అతనిపై కేసులు ఉన్నాయని వెల్లడించారు. గతంలో జైలుకు వెళ్లి వచ్చిన గోవర్ధన్ రెడ్డిపై ఇప్పటికే ఐదు చోరీ కేసులు ఉండగా, తాజాగా మరో మూడు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.