ఎల్‌నినో ప్రభావంతో బీడువారుతున్న భూములు.. ఆందోళనలో అన్నదాత
బైరెడ్డిపల్లి, ఆగస్టు 02 గరుడదాత్రి
బైరెడ్డిపల్లి మండలంలో వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. సాగుకు సిద్ధంగా ఉన్న భూములు దుక్కి కూడా దున్నలేని పరిస్థితి నెలకొనడంతో పొలాలు బీడుగా మారి రైతన్నను కలవరపెడుతున్నాయి.
ప్రతి ఏడాది ప్రభుత్వం అందించే రాయితీ వేరుశెనగ విత్తనాల కోసం రైతులు పెద్దఎత్తున ఆసక్తి చూపేవారు. అయితే ఈసారి వర్షాలు లేకపోవడంతో విత్తనాలు తీసుకున్నా విత్తే పరిస్థితి లేక రైతులు నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం పూర్తి రాయితీతో విత్తనాలు అందిస్తామని ప్రకటించినప్పటికీ, సాగుకు అనువైన వర్షపాతం లేకపోవడం రైతుల ఆందోళనను మరింత పెంచుతోంది.
ఇప్పటికే కొంతమంది రైతులు టమోటా వంటి పంటలను సాగు చేసినప్పటికీ, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక పండిన పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. ఒకవైపు వర్షాభావం, మరోవైపు ధరల పతనం రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి.
వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో అనేక మంది రైతులు, వ్యవసాయ కూలీలు జీవనోపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం కురిసిన చిరు జల్లులు కూడా సాగుకు ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో రైతన్నలో నిరాశ మరింత పెరిగింది.
రానున్న రోజుల్లోనైనా విస్తారంగా వర్షాలు కురిసి పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడాలని రైతులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.