* కుప్పం పీఇఎస్ వైద్య కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులతో సమావేశమైన నారా భువనేశ్వరి.
* యువత చేతిలోనే భవిష్యత్తు ఉందన్న నారా భువనేశ్వరి.
* ఒక్క రోజులోనే ఏ విజయము రాదు- నిరంతర కృషితోనే సాధ్యం.
* క్విజ్ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది.
* విద్యార్థుల క్రీడలను వీక్షించి, క్విజ్ పోటీలో పలు ప్రశ్నలు అడిగిన భువనేశ్వరి.
కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్): విద్యార్థులు ఎంచుకున్న రంగాలలో ప్రతిభ కనబరిచి ఉన్నతికి ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు మంగళవారం పీఎస్ వైద్య కళాశాల ప్రాంగణంలో విద్యార్థులతో జరిగిన క్విజ్ పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రారా భువనేశ్వరి మాట్లాడుతూ,విద్యార్థులతో కలిసి క్విజ్ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. యువత చేతిలోనే మన దేశ భవిష్యత్ ఉందన్నారు.
విద్యార్థులంతా ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఎంతోమంది విద్యార్థులను కలుస్తూ వారి లక్ష్య సాధనకు నా వంతుగా ప్రేరణ కలిగిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
లక్ష్యంతో ముందుకెళ్తే టీచర్, ఇంజనీర్, డాక్టర్, బిజినెస్ మ్యాన్, పోలీస్, ఐఏఎస్ , ఐపీఎస్ ఏదైనా సాధించవచ్చునన్నారు.
దేశ రక్షణలో పోలీసుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఒక్కరోజులో ఏ విజయమూ రాదని,నిరంతర కృషితోనే అది సాధ్యమవుతుందన్నారు.
తెల్లవారుజామున లేవడం, పనిలో తల్లిదండ్రులకు సాయం చేయడం వంటివి విద్యార్థులు అలవాటుగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని,వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని గుర్తుంచుకోవాలన్నారు.
గురువులు మార్గదర్శకులని, వారిని గౌరవించాలన్నారు.
కొన్నిసార్లు ఉపాధ్యాయులు కఠినంగా వ్యవహరించినా అది క్రమశిక్షణ కోసమేనని విద్యార్థులు గ్రహించాలన్నారు.
క్రమశిక్షణతో జీవిస్తే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చుని అన్నారు.తాను చెన్నైలోని చర్చ్ పార్క్ ప్రజెంటేషన్ కాన్వెంట్‌లో చదివానని, విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణ అలవరుచుకోవడం వల్లే ఎంచుకున్న రంగంలో విజయాలు సాధించానన్నారు. ప్రతి ఒక్కరినీ మెప్పించాల్సిన అవసరం లేదని,లక్ష్య సాధనలో ముందుకు వెళ్లడంపైనే దృష్టి పెట్టాలన్నారు.అందివచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివేకవంతమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలని,కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే తల్లిదండ్రులకు పిల్లలు అండగా నిలవాలని సూచించారు.
నాకు ఎదురైన ఇబ్బందులను అవకాశాలుగా మార్చుకుని ఎదిగాను.తరగతి గది మొదలు వ్యాపారం వరకూ ఎక్కడైనా సరే…సందేహాలు వస్తే భయపడకుండా అడిగి తెలుసుకోవాలి. హెరిటేజ్ సంస్థ నిర్వహణలో నాకు వచ్చే సందేహాలను అడిగేందుకు వెనకాడను. తప్పులు జరగడం సహజం. దాన్ని సరిదిద్దుకుని మరోసారి జరగకుండా చూసుకోవాలి. మంచి వ్యక్తులతో స్నేహం మన ఉన్నతికి దోహదపడుతుందన్నారు. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. మొబైల్, ట్యాబ్‌లను అవసరమైనంత వరకే ఉపయోగించాలన్నారు.
నా మనుమడు దేవాన్ష్ పుస్తకాలు బాగా చదువుతాడు. టీవీ, మొబైల్‌కి దూరంగా ఉంటాడు. నిజాయతీగా ఉండాలి. తప్పు అనిపిస్తే ధైర్యంగా చెప్పగలగాలి.
మాతృభూమికి సేవ చేయడం మన బాధ్యత. అలాగే సమాజానికి సేవ చేసేందుకు మనమంతా ముందుండాలి.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అత్యుత్తమ విద్య అందిస్తున్నాయి. విద్యార్థుల చదువుకు చేయూత అందించేందుకు మన ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒక్కో బిడ్డకు రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తోంది.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో ప్రైవేటు నుంచి 1.06 లక్షలమంది విద్యార్థులు మళ్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా బాలికలు విజ్ఞానం పెంపొందించుకోవడానికి టెక్నాలజీని వినియోగించుకోవాలి.మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి. డ్రగ్స్‌తో జీవితాలు నాశనమవుతాయి. వ్యసనాల నుంచి బయటపడటం చాలా కష్టం. పరీక్షల్లో విఫలమవడం జీవితానికి ముగింపు కాదు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. అలాంటి చర్యలతో తల్లిదండ్రులు కుంగిపోతారు. యుక్త వయసులో ఆడపిల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను నా తల్లి ఎప్పుడూ చెప్పేవారు.
జాతిపిత మహాత్మాగాంధీ, ప్రధాని నరేంద్రమోదీ వంటి వారి నుంచి స్పూర్తి పొందాలి.
మహాత్మునిలా సమాజానికి సేవ చేసే గుణం అలవరుచుకోవాలి.
విద్యార్థులంతా బాగా చదువుకుని భవిష్యత్‌లో ఉన్నతస్థానాలకు చేరుకోవాలని కోరారు. నారా భువనేశ్వరి పిఈఎస్ చేరుకున్న సందర్భంగా యాజమాన్యం, సిబ్బంది, ఉద్యోగులు నారా భువనేశ్వరి కి ఘనంగా స్వాగతం పలికారు.