సత్యవేడు జూలై 02 గరుడధాత్రి:
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వి.బి.జి. రాంజీ పథకాన్ని రద్దు చేసి, ప్రస్తుతం అమలులో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నే కొనసాగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం సత్యవేడులో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు.
అంబేద్కర్ విగ్రహం నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకనాథం పాల్గొని మాట్లాడారు. వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం పేదల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రారంభించడం పేదల ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు.
ఉపాధి హామీ పథకంలో 125 రోజుల పని ఇస్తామని చెబుతున్నప్పటికీ, వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల పాటు పనులు నిలిపివేయడం వల్ల కూలీలు మళ్లీ వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఫేస్ యాప్ కారణంగా వేలాది మంది కూలీలకు మస్టర్ నమోదు కాక నష్టాలు జరుగుతున్నాయని, ఆ యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తూ పేదల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. పరిశ్రమల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు కల్పించాలనే నిబంధనను అమలు చేయాలని, స్థానిక యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్, సీఐటీయూ ప్రాంతీయ కార్యదర్శి మెలుగు రమేష్ మాట్లాడుతూ, ఉపాధి కూలీలకు రోజుకు రూ.700 వేతనం, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో తాగునీరు, టెంట్లు వంటి కనీస వసతులు కల్పించాలని, వేతనాలను సకాలంలో చెల్లించాలని కోరారు.
అలాగే సత్యవేడు ప్రాంతంలో ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాపై అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం స్పందించకపోతే గ్రామ గ్రామాన ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, సీపీఎం నాయకులు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.