GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 9:20 pm Posted by : GARUDA DHATRI NEWS

వెలగని వీధిలైట్లతో చీకట్లో పేరడం గ్రామం

-తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

గరుడధాత్రి :

తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని పేరడం గ్రామంలో వీధిలైట్లు వెలగకపోవడంతో గ్రామం మొత్తం చీకట్లో మగ్గుతోంది. గత కొన్ని రోజులుగా ప్రధాన వీధులతో పాటు అంతర్గత రహదారుల్లో కూడా లైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రి వేళల్లో గ్రామంలో నడవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటిని ఆసరాగా చేసుకుని పాములు, విషకీటకాలు ఇళ్లలోకి వస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు రాత్రి సమయంలో బయటకు రావడానికి భయపడుతున్నారని తెలిపారు.
వీధిలైట్ల సమస్యపై పలుమార్లు అధికారులకు, పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాడైన వీధిలైట్లను తక్షణమే మరమ్మతులు చేసి గ్రామంలో వెలుగులు నింపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.