GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 8:42 am Posted by : GURU SWAMY

శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో- మనస్సుకు యోగ అంతే అవసరం

-బీసీఎన్ విద్యాసంస్థల అధినేత బీసీ నాగరాజ్.
– బీసీఎన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం.
కుప్పం,జూన్ 20 గరుడ ధాత్రి న్యూస్:అంతర్జాతీయ 12 వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీసీఎన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శనివారం కుప్పం ఇంజినీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాల మరియు నర్సింగ్ కళాశాలల విద్యార్థులతో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీసీఎన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బి.సి. నాగరాజ్ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మనసుకు యోగా అంతే అవసరం” అని పేర్కొన్నారు.
ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజు జూన్ 21 కావడంతో, ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిస్పృహ వంటి మానసిక సమస్యలకు యోగా ఒక మహౌషధమని ఆయన అన్నారు.
యోగం చేసేవానికి రోగం చేరదు” అనే నానుడిని ఉటంకిస్తూ, ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత, భావోద్వేగ నియంత్రణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని వివరించారు. యోగా మనసు-శరీరాల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని తెలిపారు.
యోగ” అనే పదానికి “కలయిక”, “సాధన” అనే అర్థాలున్నాయని పేర్కొంటూ, యోగా శారీరక దృఢత్వాన్ని, మానసిక స్థైర్యాన్ని పెంపొందించే సాధనమని చెప్పారు. వయస్సు పెరిగే కొద్దీ ఎముకల్లో కాల్షియం తగ్గి బలహీనత ఏర్పడుతుందని, కొన్ని యోగాసనాలు ఎముకలను దృఢపరచి బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయని వివరించారు.ఆరోగ్యమే మహాభాగ్యం – యోగమే ఆ ఆరోగ్యానికి రాజమార్గం” అని పేర్కొన్నారు.కుప్పం ఇంజినీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్. సునీల్ రాజ్ మాట్లాడుతూ, యోగాలో ప్రాణాయామానికి విశిష్ట స్థానం ఉందని, దీని ద్వారా విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతాయని తెలిపారు. శ్వాసను నియంత్రించినవాడు జీవితాన్ని నియంత్రించగలడు” అనే సందేశంతో ప్రాణాయామం యొక్క ప్రాధాన్యతను వివరించారు. యోగాసనాల సాధన వల్ల రక్తప్రసరణ మెరుగుపడి గుండె ఆరోగ్యం బలపడుతుందని, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యలను నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
నిత్య యోగం – నిత్య ఆరోగ్యం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కుప్పంకు చెందిన ప్రముఖ యోగా శిక్షకులు మాస్టర్ గణేష్ పాల్గొని కుప్పం ఇంజినీరింగ్ కళాశాల, కుప్పం పాలిటెక్నిక్ కళాశాల, కుప్పం డిగ్రీ కళాశాల, కుప్పం నర్సింగ్ కళాశాల విద్యార్థులకు సుఖాసనం, ఆంజనేయాసనం, భుజంగాసనం, పవనముక్తాసనం, నటరాజాసనం, వృక్షాసనం తదితర యోగాసనాలను సాధన చేయించారు.యోగ సాధనతో కళాశాల ప్రాంగణం ఆధ్యాత్మిక ఉత్సాహంతో, ఆరోగ్య చైతన్యంతో నిండిపోయింది.ఈ కార్యక్రమంలో బీసీఎన్ విద్యాసంస్థల కార్యదర్శి ఎన్. సాగర్ రాజ్, కుప్పం ఇంజినీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. భాస్కరన్, లైబ్రరీ విభాగాధిపతి డాక్టర్ సి.జి. శర్వణ్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు గంగాధర్, నాగేష్, పీఆర్‌వో ప్రవీణ్ కుమార్, కుప్పం డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ షణ్ముగం, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విమల జోసెఫ్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.”యోగం మన సంస్కృతికి వారసత్వం – ఆరోగ్యవంతమైన భారతానికి మార్గదర్శకం” అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.