GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 7:35 am Posted by : GARUDA DHATRI NEWS

శ్రీవారి పవిత్రోత్సవాలకు షెడ్యూల్ ఖరారు…

శ్రీవారి పవిత్రోత్సవాలకు షెడ్యూల్ ఖరారు…

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారు 2026 సంవత్సరానికి సంబంధించి *పవిత్రోత్సవాల* (ఆగస్టు నెల కోటా) టికెట్ల విడుదలకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ ఏడాది పవిత్రోత్సవాలు ఆగస్టు 23 నుండి ఆగస్టు 25 వరకు జరగనున్నాయి.

తేదీ: మే 21, 2026 (గురువారం) సమయం ఉదయం 10:00 గంటలకు రిలీజ్ చేస్తారు

ఉత్సవ తేదీలు: ఆగస్టు 23 (మొదటి రోజు), ఆగస్టు 24 (రెండవ రోజు), ఆగస్టు 25 (మూడవ రోజు). ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల నివారణ కోసం ఈ ‘దోష నివారణ ఉత్సవం’ నిర్వహిస్తారు. ఈ మూడు రోజులు ఆలయంలో ఇతర ఆర్జిత సేవలు (కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటివి) రద్దు చేయబడతాయి.

_*ఈసారి పవిత్రోత్సవం టికెట్లు బుక్ చేసుకో తలచిన భక్తుల కోసం…*_

మీరు online లో వసతి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు.. కొండమీద సిఆర్ఓ ఆఫీసులో మీ టిక్కెట్ మీద మూడు రోజుల ఎకామిడేషన్ దేవస్థానం వారు కేటాయిస్తున్నారు. ఈ టిక్కెట్టు ధర ఇద్దరకు 5000 రూపాయలు.. online లో లభిస్తాయి.. ఈ టిక్కెట్టు ఉన్న భక్తులకు వసత సౌకర్యం పవిత్ర ఉత్సవాల ముందు రోజు అనగా 22వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి CRO ఆఫీస్ వద్ద మీ పవిత్రోత్సవం టికెట్ చూపించినట్లయితే వారు మూడు రోజులకు వసతి కేటాయిస్తారు దీని కోసం మూడు రోజులకు 300/- మరియు అడ్వాన్స్ 500 కలిపి 800 ఛార్జ్ చేస్తారు.

Online లో సేవ బుక్ చేసుకున్న తరువాత టికెట్ రెండు ప్రింట్లు తీసుకోగలరు. ఒకటి వసతి ఇచ్చే క్రమంలో దేవస్థానం వారు తీసుకుంటున్నారు.. మరియు ఆధార్ ఫొటోస్టాట్ కాపీ ఒకటి.

పురుషులు తప్పనిసరిగా పంచ, అంగవస్త్రము ధరించవలసి ఉంటుంది..షర్ట్, బనియన్ వేసుకోరాదు.

పవిత్రోత్సవం టిక్కెట్టు మీద మూడు రోజులు అధికారులు తనిఖీ చేసి స్టాంపు వేస్తారు..

మొదటి రోజు దర్శనం పూర్తయిన తర్వాత 24 గంటల లోపు ప్రసాదం తీసుకోవలసి ఉంటుంది..

_*పవిత్రోత్సవాల మొదటి రోజు..(23/08/2026)*_

సంవత్సరానికి ఒకసారి శ్రావణమాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి త్రయోదశి నాడు తిరుమల కొండమీద పవిత్రోత్సవాలు జరుగుతాయి..

పవిత్రోత్సవాల మొదటి రోజు ఏడు గంటలకు సుపథం ఎంట్రన్స్ ద్వారా ప్రవేశించి వెండి ప్రకారంలో ఉన్న కల్యాణోత్సవ మండపంలో మలయప్ప స్వామి వారికి హోమం, పంచామృత అభిషేకం, స్నపన తిరుమంజనం జరుగుతుంది. అనంతరం ఆ సంప్రోక్షణ జలాలను భక్తుల మీద చల్లడం జరుగుతుంది. సాయంత్రం ప్రత్యేక అలంకరణతో స్వామి వారు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

దీనితో పవిత్రోత్సవం మొదటి రోజు పూర్తవుతుంది..

_పవిత్రోత్సవం రెండవ రోజు..( 24/08/2026)_

ఈరోజు ఉదయం 07.25 నిమిషాలకు సుపథం ఎంట్రన్స్ నుంచి స్వామివారి ఆలయంలో వెండి వాకిలి ప్రదక్షణ మార్గంలో ఉన్న కల్యాణోత్సవ మండపంలో ప్రవేశించేముందు టిక్కెట్లు గల భక్తులకు స్వామివారి ప్రసాదముగా అంగవస్త్రము మరియు రవిక అందజేయబడినది. హోమం, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి పంచామృత అభిషేకం అనంతరం స్నపన తిరుమంజనం కార్యక్రమం తో కార్యక్రమం పూర్తయినది. పవిత్ర సంప్రోక్షణ జలాలను భక్తుల మీద చల్లిన అనంతరం దర్శనానికి పంపడం జరిగినది. దర్శనం జయ విజయాల వద్ద నుండి మాత్రమే.. దర్శనం పూర్తయి బయటకు వచ్చేసరికి 11.47 నిమిషాలు అయినది..

ఈరోజు సాయంత్రం 6:00 గంటలకు ముందు రోజు లాగే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ప్రత్యేక అలంకరణతో మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారు..

_పవిత్రోత్సవాలు – మూడవరోజు ( 25/08/2026 )_

పవిత్రోత్సవాల మూడవరోజు యథావిధిగా సుపథం ఎంట్రన్స్ నుంచి ఉదయం ఏడు గంటలకు స్వామివారి దేవాలయంలో ఉన్న కల్యాణోత్సవ మండపానికి ప్రవేశించేముందు అర్చక స్వాములు పవిత్రోత్సవ టిక్కెట్లు ఉన్న గృహస్థులకు పవిత్రమైన పవిత్రాలు అందజేయడం జరిగింది.

చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు. ఇది తీసుకుని కళ్యాణోత్సవ మండపంలో ఉదయం 8:00 గంటల నుండి హోమం ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వార్లకు పంచామృత అభిషేకం తరువాత స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. చివరిగా ఆ అభిషేక జలాలను భక్తుల మీద చల్లి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.. అనంతరం స్వామివారి దర్శనానికి పంపడం జరిగినది.. దీనితో మూడవరోజు ఉదయం కార్యక్రమం పూర్తయినది..

_పవిత్రోత్సవాలు – మూడవరోజు సాయంత్రం._

పవిత్రోత్సవాల చివరి రోజు అనగా మూడవ రోజు సాయంత్రం సేవా టిక్కెట్లు కలిగిన భక్తులు సాయంత్రం 6:00 గంటలకు సుపథం ఎంట్రెన్స్ నుండి స్వామివారి ఆలయంలో ఉన్న సంపంగి ప్రాకారం కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి పవిత్ర యాగం నిర్వహింపబడినది. వేద మంత్రోచ్ఛారణల మధ్య రాత్రి 9:30 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం తరువాత పవిత్రోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి పంపడం జరిగింది.

తిరుమలలో స్వామివారి వద్ద మూడు రోజులు వసతి సౌకర్యం, 4 దర్శనాలతో భక్తులు తిరుగు ప్రయాణం..

(ఇవి అందజేసిన పవిత్రాలు.. అక్కడ చాలామంది తెలియక గృహస్తులు ఎవరికి వారు ధరించడం జరిగినది.. అర్చక స్వాముల చెప్పినది ఏమిటంటే మీ గృహంలో స్వామివారి పటానికి ధరింప చేయండి అని వారు చెప్పడం జరిగింది..)
ముఖ్యమైన అంశం :- పవిత్రోత్సవాల మూడవరోజు కార్యక్రమం పూర్తయ్యేసరికి 25 వ తేదీ రాత్రి 11 గంటలు అవుతుంది.. ఎందుకంటే ఈ పవిత్రోత్సవాల హోమం పూర్ణాహుతి ముఖ్యమైన అంశం మరియు పవిత్ర జలాలను భక్తులు మీద చల్లుతారు. దయచేసి మీ తిరుగు ప్రయాణం. 26 వ తేదీ ఉదయం పెట్టుకోండి