GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 4:10 pm Posted by : GURU SWAMY

శ్రీసిటీలో క్యారియర్‌ ఏసీ కంపెనీకి లోకేష్ శంకుస్థాపన

ప్రపంచ ప్రఖ్యాత క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ & రెఫ్రిజిరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో నూతన తయారీ కేంద్ర నిర్మాణాన్ని బుధవారం ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశంలో క్యారియర్‌కు తొలి తయారీ యూనిట్‌ కానుంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, మానవ వనరుల శాఖ నారా లోకేష్ ముఖ్య అతిధిగా ఈ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్యారియర్ గ్లోబల్ యాజమాన్య ప్రతినిధులు డేవిడ్ ఎల్ గిట్లిన్, మైఖేల్ ఎల్ గియర్జెస్, సుందరేశన్ నారాయణన్‌, శ్రీసిటీ ప్రతినిధులు శ్రీని రాజు, డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ భారతదేశంలోని అత్యంత చురుకైన పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లలో ఒకటైన శ్రీసిటీలో నేడు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా ఉందన్నారు. ఈ రోజు కేవలం ఒక ప్రాజెక్టును ప్రారంభించడం మాత్రమే కాదు, భారతదేశ డిజిటల్ మరియు AI అభివృద్ధి యొక్క తదుపరి అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. క్యారియర్ సంస్థ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, క్యారియర్ కేవలం ఒక కంపెనీ కాదు, ప్రపంచం శీతలీకరణ ఆలోచన విధానాన్ని మార్చిన పయనీర్ సంస్థగా అభివర్ణించారు.
“నా మొదటి ఎయిర్ కండిషనర్ కూడా క్యారియర్‌దే. కాబట్టి ఇది కేవలం వ్యాపార సంబంధం కాదు, ప్రత్యేకమైన అనుబంధం. మోడ్రన్ ఎయిర్ కండిషనింగ్‌ను కనిపెట్టడం నుండి $50 బిలియన్ గ్లోబల్ సంస్థగా ఎదగడం వరకు క్యారియర్ ఎప్పుడూ ఆవిష్కరణలో ముందంజలో ఉంది. ఇప్పుడు ఆ ఆవిష్కరణ మన రాష్ట్రానికి వస్తోంది. దీని ద్వారా ₹1000 కోట్ల పెట్టుబడి సుమారు 3,000 స్థానిక ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇది మన రాష్ట్రం, మన ఎకోసిస్టమ్ మరియు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై నమ్మకానికి నిదర్శనం” అని మంత్రి వ్యాఖ్యానించారు.
“శ్రీసిటీ కేవలం ఒక పారిశ్రామిక పార్క్ కాదు, గ్లోబల్ తయారీ కేంద్రం. 8,500 ఎకరాల విస్తీర్ణంలో 31 దేశాలకు చెందిన 250 కంపెనీలు ఉన్నాయి. $6 బిలియన్ ఎగుమతులు, 70,000 ఉద్యోగాలు, అందులో 50% మహిళలకు చెందడం విశేషం. ఆటోమోటివ్ నుండి ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ నుండి ఇంజనీరింగ్ వరకు వేదిక అయిన శ్రీసిటీ “మేక్ ఇన్ ఇండియా” మరియు “మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్”కు ప్రతీక. ఉద్యోగుల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు 50 శాతంగా వున్న శ్రీసిటీ “స్త్రీ సిటీ”గా కూడా గుర్తింపు పొందుతోంది” అని లోకేష్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే “కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”గా గుర్తింపు పొందింది. 9 ప్రముఖ ఏసీ తయారీ సంస్థలు, 30+ సరఫరా సంస్థలు ఇక్కడ ఉన్నాయి. 2027 నాటికి భారతదేశంకు అవసరమైన 60% ఏసీలు, 2028 నాటికి 80% ఇక్కడే తయారు అవుతాయని ఆశిస్తున్నాం అని ఆయన చెప్పారు.
అలాగే, క్యారియర్ మన రాష్ట్రాన్ని ఎంచుకోవడానికి యువ మరియు ఉత్సాహభరిత నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కేంద్ర-రాష్ట్ర సమన్వయం (డబుల్ ఇంజిన్ ప్రభుత్వం) మూడు ప్రధాన కారణాలుగా వెల్లడించారు. క్యారియర్ కు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. త్వరలో యువత కోసం AI ఆధారిత స్కిల్లింగ్ ప్లాట్‌ఫారమ్ (నైపుణ్యాభివృద్ధి) “మైక్రోనెట్” ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
క్యారియర్ గ్లోబల్ చైర్మన్ & సీఈఓ డేవిడ్ ఎల్ గిట్లిన్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ క్యారియర్ భారత ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. 100 మిలియన్ డాలర్ల ఈ పెట్టుబడి ద్వారా ఆవిష్కరణలు, సుస్థిరత, స్థానిక ప్రతిభాభివృద్ధికి తమ కట్టుబాటును చాటుతున్నామని అన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ భారత్ లో కీలకం కానుందని వ్యాఖ్యానించిన క్యారియర్ శ్రీసిటీ ప్లాంట్ ఎండీ సుందరేశన్, రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతఙ్ఞతలు తెలిపారు.
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, క్యారియర్ శ్రీసిటీని ఎంపిక చేసుకోవడం గర్వకారణమని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ భారతదేశ అభివృద్ధి దిశగా క్యారియర్ నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని, స్థానిక నైపుణ్యాభివృద్ధి మరియు సుస్థిర పారిశ్రామిక వృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
కాగా, 39 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పడనున్న ఈ యూనిట్‌లో అధునాతన చిల్లర్లు తయారు చేయనున్నారు. ఐదు సముద్ర తీర నౌకాశ్రయాలకు సమీపంలో ఉండటం వల్ల ఎగుమతులకు అనుకూలంగా మారనుంది. వచ్చే ఏడాది చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభించే ఈ ప్లాంట్ ద్వారా సుమారు 3,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి. అలాగే గ్రీన్ మాన్యుఫాక్చరింగ్ విధానాలతో శక్తి సామర్థ్యం గల కూలింగ్ సొల్యూషన్ల తయారీకి ఇది కేంద్రంగా మారనుంది.