– విజ్ఞానంతో పాటు వినోదం, ఆహ్లాదాన్ని పొందామన్న విద్యార్థులు
శ్రీసిటీ, మే 29,గరుడధాత్రి:
శ్రీసిటీ వేసవి శిబిరం (సమ్మర్ క్యాంపు) తమకు విజ్ఞానం, వివిధ అంశాలలో నైపుణ్య శిక్షణతో పాటు వినోదం, ఆహ్లాదాన్ని పంచిందంటూ విద్యార్థులు పేర్కొన్నారు. గత నెల 27న ఇరుగుళం జడ్పీ హైస్కూల్ లో ప్రారంభమైన వేసవి శిబిరం శుక్రవారంతో ముగిసింది. స్థానిక అకార్డ్ స్కూల్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ముగింపు కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి శిబిరం పట్ల విద్యార్థులు తమ అభిప్రాయాలను, మధురానుభూతులను పంచుకున్నారు. తమ ప్రాంతంలో గతంలో ఇలాంటివి అందుబాటులో లేవని, ఉచిత భోజన, వాహన వసతితో పాటు చక్కని శిబిరం ఏర్పాటు చేసిన శ్రీసిటీ యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపారు.
ఏప్రిల్ 27 నుంచి మే 29 జరిగిన వేసవి శిబిరంలో 8,9, 10వ తరగతుల పరీక్షలు పూర్తయిన విద్యార్థులు 68 మంది హాజరు కాగా, 50 మంది చివరివరకు పాల్గొన్నారు. శిక్షణలో స్పోకెన్ ఇంగ్లీష్, గణిత సూత్రాలు, వేదిక్ మ్యాథ్స్, బేసిక్ కంప్యూటర్ కోర్సు, వ్రాత నైపుణ్యాలు, పోటీ పరీక్షల మెళకువలు, హస్త కళలు అంశాలను బోధించారు. యోగా, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, మరికొన్ని క్రీడలలో తర్ఫీదు ఇచ్చారు. క్విజ్ పోటీలు, ఇంటరాక్టివ్ సెషన్‌లు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య చికిత్సల పట్ల ప్రత్యక్ష అభ్యసన ద్వారా అవగాహన కల్పించారు. తిరుపతిలోని జంతు సంరక్షణ కేంద్రం, సైన్స్ సెంటర్, ఇస్కాన్ ఆలయం క్షేత్ర పర్యటనలు మరియు శ్రీసిటీలోని పెప్సీ, వైటల్ పేపర్స్ పరిశ్రమలు, నర్సరీ సందర్శనలకు తీసుకెళ్లారు. స్థానిక అపోలో హెల్త్ కేర్ సెంటర్, శంకర నేత్రాలయ , కేర్ డెంటల్ వారిచే జనరల్ హెల్త్, నేత్ర, పంటి వైద్య శిబిరాలను నిర్వహించి విద్యార్థులకు పరీక్షలు చేశారు.
శ్రీసిటీ డైరెక్టర్ (CSR) నిరీషా సన్నారెడ్డి వివిధ కోర్సులతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి మార్గనిర్దేశం చేశారు. వేసవి సెలవులను వృధా చేయకుండా గ్రామీణ విద్యార్థులకు విజ్ఞానం, వినోదం, నైపుణ్య శిక్షణ అందించాలన్న లక్ష్యంతో వరుసగా రెండవ ఏడాది ఏర్పాటు చేసిన వేసవి శిబిరం విజయవంతం కావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని వినూత్న కోర్సులతో ప్రతిఏడాది వేసవి శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం శ్రీసిటీ పరిసర ప్రాంతాల విద్యాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. పరిశ్రమల భాగస్వామ్యంతో శ్రీసిటీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే పరిసర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావసతులు మెరుగు పరిచామన్న ఆమె, దీనిని నిరంతరంగా కొనసాగిస్తామని చెప్పారు.
అధ్యాపక బృందం రంజిత (క్రాఫ్ట్), దుష్యంత్ (పోటీ పరీక్షలు), సౌమ్య మరియు సాయి లక్ష్మి (ఇంగ్లీష్), చెంచయ్య (కంప్యూటర్స్, మ్యాథ్స్), కోదండం (యోగా), మురళి (క్రీడలు) వేసవి శిబిరం శిక్షకులుగా వ్యవహరించారు. ముగింపు వేడుకలలో క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. అలాగే ఆటపాటలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రంజిత రమేష్ కుమార్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మాండెలెజ్ పరిశ్రమ ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు క్యాడ్బరీ చాక్లెట్లను పంచిపెట్టారు. శ్రీసిటీ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.