GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 3:47 pm Posted by : GURU SWAMY

శ్రీసిటీలో వేడుకగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

శ్రీసిటీ, జూన్ 21, 2026 గరుడధాత్రి :

శ్రీసిటీలో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత వేడుకగా, ఉత్సాహంగా నిర్వహించారు. శ్రీసిటీ జనరల్ మేనేజర్ సన్యాసిరావు ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు స్థానిక విజిటర్స్ సెంటర్ ఆవరణలో జరిగిన యోగా కార్యక్రమంలో శ్రీసిటీ మరియు వివిధ పరిశ్రమల ప్రతినిధులు, పోలీసు శాఖ, సెజ్ డెవలప్మెంట్ కార్యాలయ సిబ్బంది, చిన్మయ, అకార్డ్ స్కూళ్ల విద్యార్థులు, స్థానికులు 180 మందికి పైగా పాల్గొన్నారు. “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా” థీమ్‌గా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
యోగా గురువు, ఏపీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.కోదండం ప్రత్యేక అతిధిగా విచ్చేసి, కార్యక్రమంలో పాల్గొన్న వారికి సూర్య నమస్కారాలు, వివిధ శ్వాస వ్యాయామాల పట్ల శిక్షణ ఇవ్వడంతో పాటు యోగా వలన కలిగే పలు ప్రయోజనాలను వివరించారు.
యోగా వేడుకలలో భాగంగా విజిటర్స్ సెంటర్ ఆవరణలో ప్రత్యేక ఆయుర్వేద శిబిరం నిర్వహించారు. శ్రీసిటీలోని తులసి ఆయుర్వేద ఆసుపత్రికి చెందిన డాక్టర్ శివప్రసాద్, వైద్య బృందం ఇందులో పాల్గొన్నారు. యోగాకు హాజరైన పలువురికి ఇందులో వైద్య సేవలు అందించడంతో పాటు సహజ ఆరోగ్యం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులపై అవగాహన కల్పించారు.
శ్రీసిటీ నివాస ప్రాంతంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న యోగా శిక్షణ కార్యక్రమాల పట్ల ప్రజలు చూపుతున్న విశేష ఆసక్తికి ఈ ఉత్సాహభరిత ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోంది.