GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 8:00 pm Posted by : GURU SWAMY

శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

సత్యవేడు జూలై 02 గరుడధాత్రి :

శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ని శ్రీసిటీలోని తాత్కాలిక క్యాంపస్‌లో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్స్, రియల్ టైం గవర్నెన్స్ మంత్రి నారాలోకేష్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐయు గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు, పాలకమండలి ప్రతినిధులు, పరిశ్రమ భాగస్వాములు పాల్గొన్నారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మంత్రి, అతిధులకు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మన యువతకు అపారమైన సామర్థ్యం, ఆశయాలు ఉన్నాయని, వారికి అవసరమైనదల్లా ఉపాధి అవకాశాలతో నేరుగా అనుసంధానమైన విద్యావిధానం అన్నారు. ఈ కీలక సవాలుకు పరిష్కారం చూపే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. ఎస్‌ఐయూ అమలు చేస్తున్నవర్క్-స్టడీ డ్యూయల్ మోడల్ కు శ్రీసిటీలోని బలమైన పారిశ్రామిక ఎకోసిస్టమ్ కీలకంగా నిలుస్తోందన్నారు. 31 దేశాలకు చెందిన 250కుపైగా కంపెనీలు వివిధ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పరిశ్రమ, విద్యావ్యవస్థలను ఇంత సమగ్రంగా అనుసంధానించిన కేంద్రాలు దేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అరుదు అని వ్యాఖ్యానించారు. ఎస్‌ఐయూలో విద్యార్థులు తాము విద్యను అభ్యసించే క్యాంపస్‌కు సమీపంలోనే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలతో కలిసి నేర్చుకునే, పనిచేసే అవకాశాన్ని పొందనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, పరిశ్రమ వర్గాల పెద్దలు పాల్గోన్నారు.