-భూములు అప్పగించిన రైతులకు పరిహారం పంపిణీ
-రెండో విడత భూసేకరణ తుది దశకు..
సత్యవేడు, ఆగస్టు 10,గరుడధాత్రి :
శ్రీసిటీ విస్తరణకు భూములు అందిస్తూ రైతులు పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన రెండో విడత భూసేకరణలో భాగంగా సత్యవేడు మండలంలోని నాలుగు రెవెన్యూ గ్రామాల్లో సుమారు 2,500 ఎకరాల భూమి సేకరణకు ప్రక్రియ కొనసాగుతుండగా, భూములు అందించిన రైతులకు పరిహారం పంపిణీ ప్రారంభమైంది.
శ్రీసిటీ విస్తరణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రెండో విడత భూసేకరణ ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక ప్రగతికి సహకారం అందించేందుకు పలువురు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రెండో విడత భూసేకరణలో భాగంగా సత్యవేడు మండలంలోని నాలుగు రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 2,500 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
భూసేకరణకు సంబంధించి జిల్లా యంత్రాంగం పలుమార్లు సంబంధిత రైతులతో చర్చలు జరిపింది. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూములకు చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించింది. భూసేకరణ ప్రక్రియలో భాగంగా అర్హులైన రైతులకు పరిహారం అందజేసే కార్యక్రమాన్ని అధికారులు కొనసాగిస్తున్నారు.
ఇందులో భాగంగా సత్యవేడు మండలం కొల్లడం గ్రామానికి చెందిన శ్రీమతి అర్పుదమ్మకు రూ.63,72,397/- భూ పరిహారం చెక్కును సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి, భూసేకరణ అధికారి దేవేంద్ర రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా భూసేకరణ అధికారి దేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. శ్రీసిటీ విస్తరణకు భూములు అందించిన రైతులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. భూసేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
శ్రీసిటీ విస్తరణతో ఈ ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత విస్తరించడంతో పాటు స్థానికంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి రైతులు అందిస్తున్న సహకారం అభినందనీయమని తెలిపారు.
రెండో విడత భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మిగిలిన భూసేకరణను కూడా పూర్తి చేసి, అర్హులైన రైతులందరికీ నిబంధనల మేరకు పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.