GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 6:56 am Posted by : GARUDA DHATRI NEWS

శ్రీ గోవిందరాజస్వామి వారికి అమూల్య నగల కానుక

శ్రీ గోవిందరాజస్వామి వారికి శ్రీవారి అమూల్య నగల కానుక

గరుడధాత్రి :
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించనున్న గరుడసేవ మహోత్సవం అపూర్వ ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకోనుంది. ఈ పవిత్ర సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి తరఫున తన అన్నగారైన శ్రీ గోవిందరాజస్వామివారికి సుమారు రూ.71 లక్షల విలువైన నాలుగు దివ్య ఆభరణాలను టిటిడి భక్తి పూర్వకంగా సమర్పించింది.
ఈ దివ్య కానుకల్లో సాధారణ రాళ్లు కలిగిన బంగారు గుండు పతకం, ఒక జత సాధారణ రాళ్లు గల బంగారు పతకాలు, బంగారు కాసుల మాల ఉన్నాయి. ఈ అమూల్య ఆభరణాలతో అలంకరింపబడిన శ్రీ గోవిందరాజస్వామివారు గరుడవాహనంపై భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
స్థానిక శ్రీ ఎదురు ఆంజనేయస్వామి ఆలయం నుండి శ్రీవారి ఆభరణాలను తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ ఎం.లోకనాథం ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలు, వేదఘోషలు, గోవింద నామస్మరణల మధ్య ఘనంగా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు.
అంతకుముందు తిరుమల నుండి అలిపిరి, కోమలమ్మ సత్రం మీదుగా బంగారు నగలు ఊరేగింపుగా శ్రీ ఎదురు ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. ప్రత్యేక పూజలు అనంతరం శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకువచ్చి ఆలయ అధికారులకు అప్పగించారు.
ఇదే సందర్భంగా స్వామివారికి నూతన వస్త్రాలు, తిరువడిని కూడా శోభాయాత్రగా ఆలయానికి తీసుకువచ్చారు. ఏనుగులు, గుర్రాలు, రంగురంగుల నృత్య బృందాలు, కోలాట కళాకారుల ప్రదర్శనలు గరుడసేవ వైభవాన్ని మరింత ఇనుమడింపజేశాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, విజివో శ్రీ గిరిధర్, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, తిరుమల ఆలయ బొక్కసం సూపరింటెండెంట్ శ్రీ వి.ఆర్.గురురాజస్వామి, ఏవీఎవ్వోలు శ్రీ శ్రీనివాసరావు, శ్రీ రాజశేఖర్, శ్రీ ఎం.ఎస్.కృష్ణన్, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.