మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం
పిల్లల విద్యకు శ్రీ సిటీ ఫౌండేషన్ అండ..
పరిశ్రమల్లో భద్రతా తనిఖీలకు ఆదేశాలు
శ్రీ సిటీ అక్టోబర్ 3 గరుడధాత్రి :
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. టెల్ టాబ్లెట్ ఇండియా పరిశ్రమలో రెండు టన్నుల బాయిలర్ పేలడంతో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించింది. మరోవైపు బాధిత కుటుంబాల పిల్లల విద్య, కుటుంబ సభ్యుల ఉపాధికి అండగా నిలిచే చర్యలను శ్రీ సిటీ యాజమాన్యం చేపట్టింది.
మృతుల్లో ఇద్దరు సత్యవేడు నియోజకవర్గానికి చెందిన వారు కాగా.. మరో ఇద్దరు తమిళనాడుకు, ఒకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికుడిగా అధికారులు తెలిపారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేసి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెండు మూడు రోజుల్లో పరిహారం బాధిత కుటుంబాలకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
బాధిత కుటుంబాల వద్దకు శ్రీ సిటీ ఎండీ :
ప్రమాద విషయం తెలిసిన వెంటనే శ్రీ సిటీ ఎండీ రవిసన్నారెడ్డి తన అపాయింట్‌మెంట్లను రద్దు చేసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులతో కలిసి ఘటనపై వివరాలు తెలుసుకున్న అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్టకాలంలో శ్రీ సిటీ యాజమాన్యం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.
కుటుంబ పెద్దలను కోల్పోయిన చిన్నారుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీ సిటీ ఫౌండేషన్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మృతుల పిల్లల విద్యాభ్యాసం మధ్యలో ఆగిపోకుండా ఉన్నత విద్య వరకు అవసరమైన సహకారం అందించే చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా మృతుల కుటుంబాల్లో విద్యావంతులు, ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఉంటే.. వారి అర్హతలకు అనుగుణంగా శ్రీ సిటీలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ప్రమాద కారణాలపై విచారణ :
బాయిలర్ పేలుడుకు గల కారణాలను వెలికితీసేందుకు రెవెన్యూ, పోలీస్, ఫైర్, బాయిలర్ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సంబంధిత బాయిలర్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. పరిశ్రమపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
అన్ని పరిశ్రమల్లో భద్రతా తనిఖీలు :
శ్రీ సిటీ ఏర్పాటైన 18 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం తొలిసారిగా చోటుచేసుకుందని కలెక్టర్ తెలిపారు. తాజా ఘటన నేపథ్యంలో శ్రీ సిటీలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించి, లోపాలు గుర్తిస్తే తక్షణ చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
బాయిలర్ పేలుడు ఐదుగురు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చిన నేపథ్యంలో.. ప్రభుత్వం ప్రకటించిన పరిహారంతో పాటు మృతుల పిల్లల విద్య, కుటుంబ సభ్యుల ఉపాధికి అండగా నిలిచే చర్యలు బాధిత కుటుంబాలకు కొంత భరోసానిస్తున్నాయి.