GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 11:31 am Digital Edition : GURU SWAMY

సత్యవేడులో ఆపరేషన్ త్రిశూల్‌..

మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, నేరాల నియంత్రణపై అవగాహన

సత్యవేడు, సెప్టెంబర్ 26 గరుడధాత్రి:

ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా సత్యవేడు మండలం వీఆర్ కండ్రిగ ఎస్సీ కాలనీలో పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సత్యవేడు సీఐ మురళి, ఎస్‌ఐ టి. సైనాథ్ చౌదరి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రత, నేరాల నివారణ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
గంజాయి వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే అనర్థాలను వివరించిన పోలీసులు.. గంజాయి నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. పగలు, రాత్రి ఇళ్లలో దొంగతనాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరానికి మించి నగదు, బంగారం, విలువైన వస్తువులను ఇళ్లలో ఉంచవద్దని సూచించారు.
అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అత్యవసర పోలీసు సేవల కోసం డయల్‌-112, సైబర్ మోసాలకు గురైనప్పుడు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో స్థానిక ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు సహకరించారు. ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు.