GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 3:14 pm Posted by : GURU SWAMY

సత్యవేడులో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

సత్యవేడు, జూన్ 21 గరుడధాత్రి :
భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్ – తిరుపతి, నేషనల్ ఫిట్‌నెస్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో 1వ జాతీయ స్థాయి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం సత్యవేడు ఎన్‌టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల సభ్యులు, స్థానిక ప్రజలు కలిపి 200 మందికి పైగా పాల్గొని సామూహిక యోగా సాధన చేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని సందేశం అందించారు.
కార్యక్రమానికి హాజరైన అతిథులు యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ, ఆధునిక జీవనశైలిలో యోగా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సత్యవేడు సబ్‌ ఇన్‌స్పెక్టర్ సాయి నాథ్ చౌదరి యోగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. యువత ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను పొందవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని NFHOI చైర్‌పర్సన్ పి. రేవతమ్మ, అధ్యక్షుడు ఎం.ఎ. భాస్కర్, ప్రధాన కార్యదర్శి డి. హేమ కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, వాలంటీర్లు మరియు ప్రజలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, “యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వం. యోగా ద్వారా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ పెంపొందుతాయి” అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా యోగా, ఫిట్‌నెస్, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.
చివరగా అందరూ యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకొని ఆరోగ్యవంతమైన భారత నిర్మాణానికి కృషి చేయాలని ప్రతిజ్ఞ చేసి కార్యక్రమాన్ని ముగించారు.