సత్యవేడు ఆగస్టు 15 గరుడధాత్రి
సత్యవేడు మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి మువ్వన్నెల రెపరెపల నడుమ సంబరాలు జరుపుకున్నారు.స్థానిక జూనియర్ సివిల్ జడ్జి మరియు జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో జడ్జి ఏ. వెంకట నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. న్యాయవాదులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించిన అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ శివప్రసాద్, సాయినాథ్ చౌదరి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి జాతీయ జెండాలను ఎగురవేసి వందనం సమర్పించారు. అలాగే, సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మెలుగు రమేష్ కార్యకర్తల నడుమ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇలా మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వాడవాడలా వేడుకలు మిన్నంటాయి.
అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి పోరాట పటిమను, ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. అమరవీరుల అడుగుజాడల్లో నడుస్తూ దేశ ప్రగతికి, సమాజ శ్రేయస్సుకు పునరంకితం కావాలని, యువత వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.