ట్రాఫిక్‌కు అంతరాయంగా మారిన కంకర లారీల తాకిడి…!
ఉదయం, సాయంత్రం వేళల్లో బజారుకు రావాలంటేనే భయాందోళన..!
సత్యవేడు జూలై 28 గరుడధాత్రి :
కొద్ది రోజుల విరామం అనంతరం మండలంలోని చమర్త కండ్రిగ నుంచి మళ్లీ భారీ టన్నేజీతో కంకర లారీల రాకపోకలు జోరందుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో వెళ్తున్న లారీల కారణంగా రహదారులు దెబ్బతింటుండటమే కాకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎప్పుడో నిర్మించిన ఆర్ అండ్ బి రోడ్లు ఈ భారీ వాహనాల ఒత్తిడిని తట్టుకోలేక అక్కడక్కడా పగుళ్లు, గుంతలతో దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలకు వెళ్లే, తిరిగి వచ్చే విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
పట్టణానికి షాపింగ్ కోసం వచ్చే ప్రజలు కూడా కంకర లారీల వేగం, రద్దీ కారణంగా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోడ్ల కూడలిలోని మహాత్మా గాంధీ విగ్రహం, టవర్ క్లాక్ పరిసరాల్లో రహదారి ఇప్పటికే పెచ్చులూడిపోతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఆర్ అండ్ బి శాఖ నిర్లక్ష్యంతో రోడ్లపై ఆక్రమణలు పెరుగుతున్నాయని, అంగళ్లను రహదారులపైనే నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
అలాగే రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టకపోవడంతో అధిక లోడుతో కంకర తరలిస్తున్న లారీలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయని, దీనివల్ల రోడ్లు ధ్వంసమవడమే కాకుండా ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రజల ప్రాణాలు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం అధిక లోడుతో నడిచే లారీలపై వెంటనే చర్యలు తీసుకుని, కఠిన తనిఖీలు నిర్వహించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.