GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 8:04 pm Digital Edition : GURU SWAMY

సత్యవేడు అభివృద్ధి పనులపై జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

సత్యవేడు, ఆగస్టు 4 గరుడధాత్రి :

సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో పిచ్చాటూరు మండలం ఎస్‌ఎస్‌బీ పేటతో పాటు ఇతర గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 400 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే పిచ్చాటూరు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న పర్యాటక టవర్ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన తుడా నిధులను విడుదల చేయడంతో పాటు మండలంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
వరదయ్యపాలెం తహసీల్దార్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్ పోస్టును వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్యే కోరగా, దీనిపై జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
అదేవిధంగా నారాయణవనం, నాగలాపురం, సత్యవేడు మండలాలకు నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా వినతిపత్రంలో పేర్కొన్నారు.
వినతిపత్రంలోని అంశాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడంతో పాటు సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.