GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 October 2026, 10:25 am Digital Edition : GURU SWAMY

సత్యవేడు టీడీపీలో ఎంపీపీ పీఠంపై పీటముడి..!

పదవి కోసం నేతల ప్రయత్నాలు.. ఎవరికి దక్కేనో..?

వైసీపీ నుంచి వచ్చిన నాయకురాలికి అవకాశం అంటూ ప్రచారం

సీనియర్లలో అసంతృప్తి.. అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ

సత్యవేడు, అక్టోబరు 20 గరుడధాత్రి:

స్థానిక సంస్థల ఎన్నికల వేళ సత్యవేడు మండల తెలుగుదేశం పార్టీలో ఎంపీపీ పదవి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పదవిని దక్కించుకునేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం పార్టీలో ఆసక్తి రేపుతోంది. మాజీ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత మండల అధ్యక్షుడు శివకుమార్‌నాయుడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ జడ్పీటీసీ సభ్యురాలికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం కొత్త చర్చకు తెరలేపింది. దీంతో పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్లకు ప్రాధాన్యం దక్కుతుందా? లేక కొత్త రాజకీయ సమీకరణాలకు పెద్దపీట వేస్తారా? అన్నది తెలుగు తమ్ముళ్లలో చర్చనీయాంశంగా మారింది.

ఎవరికి దక్కేనూ..?

ఎంపీపీ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. మాజీ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి నియోజకవర్గ స్థాయి నాయకుల మద్దతు ఉందని, ప్రస్తుత మండల అధ్యక్షుడు శివకుమార్‌నాయుడు అధిష్ఠానం ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారని ఆయా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీపీ పదవిపై పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

వలస నేతకు అవకాశం దక్కేనా..?

గతంలో వైసీపీలో కొనసాగిన మాజీ జడ్పీటీసీ సభ్యురాలికి ఎంపీపీ పదవి కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం స్థానికంగా చర్చకు దారితీసింది. అయితే దీనిపై పార్టీ నాయకత్వం నుంచి అధికారిక స్పష్టత లేదు. ఈ ప్రచారం నేపథ్యంలో పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుందా? అనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

సీనియర్లకు ప్రాధాన్యమిస్తారా..?

పార్టీ బలోపేతానికి కృషి చేసిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఇతర సీనియర్‌ నాయకులకు పదవుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. తమ సేవలను పరిగణనలోకి తీసుకోకుండా ఇతరులకు అవకాశాలు కల్పిస్తే అసంతృప్తి పెరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ఎలా ఉంటుందన్నది ప్రాధాన్యం సంతరించుకుంది.

అధిష్ఠానం నిర్ణయంపైనే చూపు..!

ఎంపీపీ పదవి కేటాయింపుపై పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం కోసం సత్యవేడు టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. ఆశావహుల్లో ఎవరికి అవకాశం కల్పిస్తారు? సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తారా? ప్రచారంలో ఉన్న పేర్లలో ఎవరి అభ్యర్థిత్వానికి ఆమోదం లభిస్తుంది? అన్నది తేలాల్సి ఉంది. పదవి కేటాయింపు విషయంలో నాయకత్వం అనుసరించే వైఖరి పార్టీ అంతర్గత సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.