GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 8:44 pm Digital Edition : GURU SWAMY

సమయస్ఫూర్తితో యువకుడి ప్రాణాలు కాపాడిన నాయుడుపేట పోలీసులు ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు: జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు

కుటుంబ సమస్యలతో క్షణికావేశానికి లోనైన ఓ యువకుడి ప్రాణాలను నాయుడుపేట పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున నాయుడుపేట బైపాస్ రోడ్ సమీపంలో చోటుచేసుకుంది.
సుమారు 33 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై, చేతులను కోసుకుని తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో రోడ్డుపక్కన పడిపోయాడు. సమాచారం అందుకున్న నాయుడుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
హెడ్ కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుల్ శ్రీను సమయోచితంగా స్పందించి, బాధితుడిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. వారి చాకచక్యంతో యువకుడి ప్రాణాలు రక్షించబడినట్లు అధికారులు తెలిపారు. అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులను గుర్తించి సమాచారం అందించారు.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పోలీసు సిబ్బందిని అభినందించారు. ప్రజల ప్రాణాలు, భద్రతను కాపాడటం పోలీస్ శాఖ అత్యున్నత బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. నాయుడుపేట పోలీసుల అప్రమత్తత, మానవత్వం పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతాయని అన్నారు.
యువతకు ఎస్పీ కీలక సందేశం ఇచ్చారు. జీవితంలో సమస్యలు సహజమని, కానీ ఆత్మహత్య ఎప్పటికీ పరిష్కారం కాదని స్పష్టం చేశారు. మానసిక ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఆత్మీయులతో మాట్లాడాలని సూచించారు.
ఒక క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయం జీవితాలను ఛిద్రము చేయడమే కాకుండా కుటుంబ సభ్యులకు జీవితాంతం బాధను మిగులుస్తుందని హెచ్చరించారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొని, సమస్యలకు పరిష్కారం కనుగొనాలని యువతకు పిలుపునిచ్చారు.
ప్రజల రక్షణ కోసం తిరుపతి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా, సేవాభావంతో పనిచేస్తూనే ఉంటారని జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది