8 రోజుల్లో 5.76 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం
హుండీ కానుకలు రూ.28.94 కోట్లు – 33 లక్షల లడ్డూల విక్రయం
21.84 లక్షల అన్నప్రసాదాల పంపిణీ – 2.04 లక్షల మంది తలనీలాలు సమర్పణ
గరుడసేవ రోజున భక్తులందరికీ దర్శనం కల్పించాం
20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలు
తొలిసారిగా విదేశీ కళాబృందాల ప్రదర్శనలు
తిరుమల, సెప్టెంబర్ 23 గరుడధాత్రి
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు టీటీడీ అధికారులు, సిబ్బంది, పోలీసు శాఖ, ఇతర విభాగాల సమన్వయంతో విజయవంతంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎనిమిది రోజుల వ్యవధిలో సుమారు 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేయగా, ముఖ్యంగా గరుడసేవ రోజున వచ్చిన భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తుల నుంచి హుండీ ద్వారా రూ.28.94 కోట్ల కానుకలు లభించాయి. భక్తుల కోసం సుమారు 33 లక్షల లడ్డూలను విక్రయించగా, వివిధ ప్రాంతాల్లో 21.84 లక్షల అన్నప్రసాదాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే 2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు వివరించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశంలోని 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలు పాల్గొని తమ కళలను ప్రదర్శించాయి. అంతేకాకుండా తొలిసారిగా విదేశీ కళాబృందాలకు కూడా ప్రదర్శనలకు అవకాశం కల్పించడం ద్వారా బ్రహ్మోత్సవాల సాంస్కృతిక వైభవం మరింత విస్తరించిందని చైర్మన్ తెలిపారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, వసతి, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం, తలనీలాల సమర్పణ తదితర అంశాల్లో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించగలిగామని శ్రీ బీ.ఆర్. నాయుడు పేర్కొన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన అధికారులు, సిబ్బంది, పోలీసు శాఖ, కళాకారులు, స్వచ్ఛంద సేవకులు, స్థానికులు, భక్తులందరికీ టీటీడీ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.