సత్యవేడు, ఆగస్టు 23 గరుడధాత్రి:
సమాజంలో ప్రతి చిన్నారికి సమాన అవకాశాలు కల్పించడమే సమ్మిళిత విద్య లక్ష్యమని సత్యవేడు మండల విద్యాశాఖ అధికారి రవి అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను సాధారణ విద్యార్థులతో కలిపి విద్యనందించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, స్వీయ గౌరవం, ధైర్యం పెంపొందుతాయని పేర్కొన్నారు.
శనివారం సత్యవేడు స్థానిక బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రెండో విడత జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంఈఓ రవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగవైకల్యం ఉన్న పిల్లలతో పాటు సాధారణ విద్యార్థులు ఒకే పాఠశాలలో, ఒకే తరగతి గదిలో కలిసి చదువుకునేలా చేయడమే సమ్మిళిత విద్య ఉద్దేశమన్నారు. కులం, మతం, ఆర్థిక స్థితి, శారీరక పరిస్థితి వంటి ఎలాంటి భేదాలు లేకుండా ప్రతి చిన్నారికి సమాన విద్యా అవకాశాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను సాధారణ విద్యార్థులతో కలిపి విద్యనందించడం వల్ల వారిలో “నేను కూడా అందరిలాగే సమానమే” అనే భావన చిన్ననాటి నుంచే ఏర్పడుతుందని తెలిపారు. అంధులు, మూగ, చెవిటి, అభ్యాసనలో వెనుకబడిన పిల్లలను ఇతర విద్యార్థులతో కలిపి విద్య, ఆటలు, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు.
ఇలాంటి వాతావరణం పిల్లల మధ్య పరస్పర సహకారం, స్నేహభావం, అవగాహనను పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో సమాజంలో సమానత్వ భావన బలపడేందుకు దోహదపడుతుందని ఎంఈఓ రవి అన్నారు.
అనంతరం రిసోర్స్ పర్సన్ జ్ఞానజ్యోతి శిక్షణకు సంబంధించిన వివిధ అంశాలను అంగన్‌వాడీ కార్యకర్తలకు వివరించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించడం, వారికి అవసరమైన సహకారం అందించడం, వారి సామర్థ్యాలను ప్రోత్సహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
స్థానిక ఐసీడీఎస్ సీడీపీఓ దేవకుమారి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు త్యాగరాజులు, సుబ్రమణ్యం, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.