GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 3:34 pm Digital Edition : GURU SWAMY

సాగునీటి ప్రాజెక్టుల పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ పోరుబాట

*అరణియార్‌ ప్రాజెక్టు దుస్థితిపై రైతుల పక్షాన పోరాటం

*కీలపూడి నుంచి అరణియార్‌ వరకు మహా ర్యాలీకి సన్నాహాలు

*కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డ ఎంపీ గురుమూర్తి, నూకతోటి రాజేష్‌

*జలధార పేరుతో ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆరోపణ

పిచ్చాటూరు, సెప్టెంబర్ 13, గరుడధాత్రి:
సాగునీటి ప్రాజెక్టుల పరిరక్షణ, రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ దశలవారీగా ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా పిచ్చాటూరు కేంద్రంగా అరణియార్‌ ప్రాజెక్టు సమస్యలపై భారీ ఉద్యమానికి సన్నాహాలు ప్రారంభించారు.
భారీ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆదివారం పిచ్చాటూరు మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కె.వి. చలపతిరాజు ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌, తాడిపత్రి సమన్వయకర్త బిరేంద్ర వర్మ, సాగునీటి పరిరక్షణ కమిటీ సభ్యుడు రాకేష్‌ హాజరయ్యారు.
పార్టీ నాయకులు కె.వి. చలపతిరాజు, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌ నాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హరిచంద్రరెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు రమేష్‌రాజు తదితరులు వారికి శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు.

-అరణియార్‌ ప్రాజెక్టు దుస్థితిపై ఆగ్రహం

ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి, పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల్లో ప్రముఖమైన అరణియార్‌ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం కనీసం 4 వేల ఎకరాలకు కూడా పూర్తిస్థాయిలో నీరు అందని పరిస్థితి నెలకొందని అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి తమ పార్టీ అండగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

-‘జలధార’పై నేతల విమర్శలు

గతంలో ‘నీరు-చెట్టు’ పథకం పేరుతో టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన నేతలు.. ప్రస్తుతం ‘జలధార’ పేరుతో మైనర్‌ ఇరిగేషన్‌ పనులు చేపడుతున్నామని చెబుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
జైకా నిధులు మంజూరైనప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీంతో నిధులు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. గాలేరు-నగరి ప్రాజెక్టును అరణియార్‌తో అనుసంధానం చేస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు ప్రాజెక్టు పరిసరాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని సూచించారు.

-కీలపూడి నుంచి అరణియార్‌ వరకు మహా ర్యాలీ

రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టుల సమస్యలపై దశలవారీగా ఉద్యమం చేపడతామని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా కీలపూడి నుంచి అరణియార్‌ ప్రాజెక్టు వరకు మహా ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ర్యాలీ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు సాకే శైలజానాథ్‌, అనంత వెంకటరామిరెడ్డి తదితరుల నేతృత్వంలో రాయలసీమలోని 11 నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇన్‌చార్జిలు పాల్గొంటారని తెలిపారు. రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని ఎంపీ గురుమూర్తి పిలుపునిచ్చారు.

-కుడి కాలువ సమస్యను ప్రస్తావించిన రైతులు

సమావేశంలో పాల్గొన్న నాగలాపురం ప్రాంత రైతులు అరణియార్‌ ప్రాజెక్టు కుడి కాలువకు సంబంధించిన సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. రైతుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని పార్టీ నేతలు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కేజీ రోసిరెడ్డి, భూపతి, మోహన్‌రెడ్డి, సూరిబాబురెడ్డి, తోపయ్య, మోహన్‌, చెంగల్రాయల్‌రెడ్డి తదితరులతో పాటు నియోజకవర్గంలోని ఏడు మండలాల నాయకులు గవర్ల కృష్ణయ్య, సుశీల్‌కుమార్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి, లాలీబాబు యాదవ్‌, చిన్నదొరై, విశ్వనాథం, ఉదయ్‌కుమార్‌రెడ్డి తదితరులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.