తిరుపతి, ఆగస్టు 20: సూదలగుంట షుగర్స్ యూనిట్–1, యూనిట్–2కు సంబంధించి రైతులకు, రవాణా కాంట్రాక్టర్లు, హార్వెస్టింగ్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరితగతిన ఇప్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో కలిసి రైతుల బకాయిల అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సూదలగుంట షుగర్స్‌కు సంబంధించి గతంలో ఉన్న బకాయిలు, ప్రస్తుతం చెల్లించాల్సిన మొత్తాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, బకాయిల వసూలుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
2018–19 క్రషింగ్ సీజన్‌కు సంబంధించి సుమారు రూ.30 కోట్ల మేర రైతులకు బకాయిలు ఉండగా, 2022లో అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్‌ఆర్ యాక్ట్ (Revenue Recovery Act) కింద చర్యలు చేపట్టి, ఊతుకోటలోని సుమారు 106 ఎకరాల భూమిని వేలం ద్వారా విక్రయించి రైతులకు సుమారు రూ.15 కోట్ల వరకు చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రస్తుతం అదనపు చెరకు ధరతో కలిపి సూదలగుంట షుగర్స్ యూనిట్–1, యూనిట్–2కు సంబంధించి రైతులకు సుమారు రూ.27 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, అదేవిధంగా రవాణా కాంట్రాక్టర్లు, హార్వెస్టింగ్ కార్మికులకు మరో రూ.3 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు సమావేశంలో వెల్లడించారు.
బకాయిల వసూలుకు సంబంధించి నమోదైన చెక్ బౌన్స్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ అయిన అంశాన్ని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ డిప్యూటీ కేన్ కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, రైతుల బకాయిల పరిష్కారానికి సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడితో ఈ అంశంపై కలెక్టర్ చర్చించారు. కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను చట్టపరమైన నిబంధనల మేరకు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ, NBW అమలుకు తక్షణ చర్యలు చేపడతామని తెలిపారు.
సమావేశంలో రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువస్తూ, గత ఎనిమిది సంవత్సరాలుగా బకాయిలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. బకాయిల కోసం ఎదురుచూస్తున్న పలువురు రైతులు మృతి చెందారని, తమ కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొంటూ, బకాయిలను వీలైనంత త్వరగా ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు.
రైతుల విజ్ఞప్తిపై కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ వెంటనే స్పందించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, అక్కడ ఉన్న సంబంధిత ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే బి.ఎన్. కండ్రిగలో జప్తు చేసిన సుమారు 83 ఎకరాల భూమికి కూడా త్వరితగతిన వేలం నిర్వహించి, నిబంధనల మేరకు వచ్చిన మొత్తాన్ని రైతుల బకాయిల చెల్లింపునకు వినియోగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపే దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. రైతులకు చట్టబద్ధంగా అందాల్సిన బకాయిలను వీలైనంత త్వరగా అందేలా చర్యలు చేపట్టాలని, ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
రైతుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సహకరిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. బకాయిల వసూలు, ఆస్తుల వేలం, కోర్టు ఆదేశాల అమలు తదితర అంశాల్లో సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కెన్ కమీషనర్ జాన్ విక్టర్, సూదలగుంట షుగర్స్‌కు సంబంధించిన రైతులు తదితరులు పాల్గొన్నారు.