GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 5:46 pm Posted by : GARUDA DHATRI NEWS

సూర్యలంక మత్స్యకారులకు అన్యాయం

-కలెక్టర్ హామీని బేఖాతరు చేసిన ఎమ్మార్వో?

బాపట్ల: సూర్యలంక తీర ప్రాంత అభివృద్ధి పనుల నేపథ్యంలో స్థానిక మత్స్యకారులు, గిరిజనుల పునరావాసంపై వివాదం నెలకొంది. ఎంతో కాలంగా ఇక్కడే నివాసాలు ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్న తమకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించడంలో అధికారులు వివక్ష చూపిస్తున్నారని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తీరప్రాంత అభివృద్ధిలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న బాధితులను ఇటీవల బాపట్ల జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ స్వయంగా కలిసి మాట్లాడారు.

నివాసాలు కోల్పోతున్న ప్రతి ఒక్కరికీ వేరే చోట నివాస స్థలాలు కేటాయించిన తర్వాతే ఇక్కడి నుండి ఖాళీ చేయిస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే, కలెక్టర్ ఇచ్చిన భరోసా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

“దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదు” అన్న చందంగా బాపట్ల ఎమ్మార్వో వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఎమ్మార్వో కేవలం గిరిజనులకు మాత్రమే నివాస స్థలాలు కేటాయించి, మత్స్యకారులను పూర్తిగా విస్మరించారని వారు ఆరోపిస్తున్నారు. తమకు ఈ సమస్యతో సంబంధం లేనట్లుగా అధికారులు ప్రవర్తించడంపై మత్స్యకార కుటుంబాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

తరతరాలుగా సముద్ర తీరాన్నే నమ్ముకుని బతుకుతున్న తమకు కూడా తక్షణమే నివాస స్థలాలు కేటాయించాలని, జిల్లా కలెక్టర్ స్పందించి ఎమ్మార్వో తీరుపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. తమకు కూడా పూర్తి న్యాయం జరిగేలా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.