GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 4:07 pm Posted by : GARUDA DHATRI NEWS

సేఫ్ తిరుపతి మా లక్ష్యం.. ప్రజల సహకారమే మా బలం తిరుపతిలో వజ్రపహార్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ – ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు

ప్రజలకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీసులు శనివారం తెల్లవారుజామున భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్టీవీ నగర్, న్యూ ఇందిరా నగర్ ప్రాంతాల్లో “వజ్రపహార్” పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీలు విస్తృత స్థాయిలో సాగాయి.
పోలీస్, ఎక్సైజ్, ఆర్‌టీఏ, ఈగల్, రెవెన్యూ, ఆర్మ్డ్ రిజర్వ్, డాగ్ స్క్వాడ్ విభాగాల సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో నివాస గృహాలు, అద్దె ఇళ్లు, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి నేర చరిత్రను పరిశీలిస్తున్నారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., స్వయంగా ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ ప్రాంతాల్లో గతంలో రౌడీషీటర్లు, గంజాయి వినియోగదారుల కదలికలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేర కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
గంజాయి వినియోగంపై అనుమానితులకు టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్‌గా గుర్తించిన వారికి ముందుగా కౌన్సెలింగ్, అవసరమైతే పునరావాసం కల్పిస్తామని చెప్పారు. అయితే పునరావృతమైతే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదకద్రవ్యాల సరఫరా మూలాలను గుర్తించి, సరఫరాదారులపై కూడా ఉక్కుపాదం మోపనున్నట్లు వెల్లడించారు.
“సేఫ్ తిరుపతి” కేవలం పోలీసుల లక్ష్యం మాత్రమే కాదని, అది ప్రజలందరి లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి, మాదకద్రవ్యాలు, రౌడీయిజం వంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 112 లేదా 1972కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
“ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీసులా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజల సహకారంతోనే తిరుపతిని మరింత సురక్షిత నగరంగా తీర్చిదిద్దగలం” అని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ ఆపరేషన్‌లో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి (శాంతిభద్రతలు), శ్రీనివాసరావు (సాయుధ దళం), డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.