GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 6:06 am Digital Edition : GURU SWAMY

స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో పలమనేరు మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు

*అధికారులు, సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే అమర్

పలమనేరు, అక్టోబర్ 08 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు మున్సిపాలిటీకి స్వచ్ఛ ఆంధ్ర–2026 రాష్ట్రస్థాయి అవార్డు దక్కడంపై మున్సిపల్ అధికారులు, సిబ్బందిని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ రెడ్డి గురువారం సాయంత్రం అభినందించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు, సిబ్బంది చేసిన కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయిలో పలమనేరు మున్సిపాలిటీకి అవార్డు రావడం ఎంతో గర్వకారణమని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని మున్సిపాలిటీలలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ విజయాన్ని సాధించడంలో అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది సమష్టిగా చేసిన కృషి అభినందనీయమన్నారు.
అదేవిధంగా జిల్లాస్థాయిలో మెప్మా విభాగం ఆధ్వర్యంలో టెర్రస్ గార్డెన్ అంశంలో అవార్డు సాధించడంపై కూడా ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. పట్టణాల్లో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. మున్సిపాలిటీకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు వెంకటేష్ వ్యక్తిగతంగా అవార్డు పొందడం పట్ల ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రశంసించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వారికి అవార్డులు అందించడం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నారు.
పలమనేరు మున్సిపాలిటీ భవిష్యత్తులోనూ వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి గుర్తింపులు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి, మంచి కార్యక్రమాల అమలుకు తన వంతుగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ, డీఈ సురేష్ బాబు, మేనేజర్ ఖాదర్ మొహిద్దీన్, ఏఈలు శిరీష, స్నేహ, టీపీఎస్ ఇందిరా, మెప్మా సీఎంఎం బాబా తదితరులు పాల్గొన్నారు.