GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 6:05 pm Posted by : GURU SWAMY

స్వపక్షం లోనే.. విపక్షం..! –నాగలాపురం టిడిపిలో గరం గరం..

-ఆ నేత ఆదేశాలు.. కేసులు నమోదు
-పార్టీ కేంద్ర కార్యాలయంకు
-ఫిర్యాదుల వెల్లువ

అరుణానది పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అడ్డగోలు కార్యకలాపాలు అడ్డుకుంటే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం జరిగిందని సత్యవేడు నియోజకవర్గ నాగలాపురం మండలం టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నియమించిన ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు కేసులు పెట్టడం జరిగిందని వారు వాపోతున్నారు‌. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా… స్వపక్షంలోనే విపక్షం ఉన్నట్లు అక్రమ ధన దాహానికి దాసోహమైన వారు బరితెగించి ఈ దారుణానికి పాల్పడ్డారని బాధిత టిడిపి నేతలు కేంద్ర పార్టీ కార్యాలయం కు లేఖలు పంపారని సమాచారం. పోలీసుల పనితీరు బాగాలేదని, రెండేళ్లుగా జరిగిన పరిణామాలను ఆరా తీసి న్యాయం చేయాలని వారు కోరినట్లు సమాచారం. పగలు రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో ఇసుకను తోడేయడం అన్యాయమని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారని బాధితులు నిప్పులు కక్కుతున్నారు.

-కేసులు

తమిళనాడుకు చెందిన ఓ జెసిబి డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో అధికార పార్టీకి చెందిన తిరుపతి, నెల్సన్ మండేలా, వై నాగరాజు, చంద్రశేఖర్, మనోహర్, సుబ్రహ్మణ్యం, సభ, జనసేనకు సంబంధించి మణికంఠయ్య, సునీత తదితరులపై ఈనెల 16న కేసు నమోదు అయింది. అక్రమాలు అడ్డుకుంటే… కేసు నమోదు చేయడం అన్యాయమైన విషయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఇచ్చే ఆదేశాలను సర్కిల్ అధికారి, ఇతర ఎస్ఐలు కళ్ళు మూసుకుని అమలు చేస్తున్నారని, వాస్తవాలు గ్రహించడం లేదని కూడా వారు టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కొన్నిచోట్ల కొత్తగా పార్టీలోకి గోడ దూకి వచ్చిన వారు… రెచ్చిపోయి పార్టీ సీనియర్లను, కార్యకర్తలను ఆనగదొక్కడమే ధ్యేయంగా, అక్కడ కొనసాగించిన పాడు బుద్ధిని ఇక్కడ కూడా కొనసాగించడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతున్నట్లు వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.