* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
* రాష్ట్రంలో మూడు లక్షల త్రీడీ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం.
* కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ హాజరు.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి తీరుతామని హామీ ఇచ్చామని ఆ హామీని తప్పకుండా నెరవేరుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం లో ఆదివారం 3 లక్షల త్రీడీ ఇళ్ల నిర్మాణం కు శంకుస్థాపన నిర్వహించారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మ సాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిపి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
2029 నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ వంద శాతం పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ టెక్నాలజీతో పైలట్ ప్రాజెక్ట్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, దీనివల్ల బయటి వాతావరణం కంటే ఇంట్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 6 లక్షల ఇళ్లను రద్దు చేసి, చెరువులు, గుట్టల్లో నివాసయోగ్యం లేని జాగాలు ఇచ్చి హౌసింగ్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. దేశంలో ప్రధాని మోదీ 12 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లు నిర్మించారని, మధ్యప్రదేశ్ను నదుల అనుసంధానంతో అభివృద్ధి చేసి ప్రజల చేత ‘మామ’ అని పిలిపించుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రానికి 9 లక్షల ఇళ్ల మంజూరుకు హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి పల్లె పండుగ నిర్వహించామన్నారు. రాయలసీమను రూ.1 లక్ష కోట్లతో గ్లోబల్ హార్టీకల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పట్టిసీమ ద్వారా పంటలను కాపాడిన తరహాలోనే పోలవరం పూర్తి చేసి రాష్ట్రమంతటా నీటి ఎద్దడి లేకుండా చేస్తామని, అమరావతి అభివృద్ధి ద్వారా పరిసర ప్రాంతాలన్నీ మెగాసిటీగా మారనున్నాయని సీఎం వెల్లడించారు. అంతేకాక 2027 ఫిబ్రవరిలో అమరావతి నుండి ఆధునిక క్వాంటం కంప్యూటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, ప్రకృతి సేద్యం మరియు మౌలిక సదుపాయాల కల్పన ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు.గత ప్రభుత్వ పాలనలో నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వడం వల్ల 4 లక్షల మంది పేదలు వద్దన్నారని, ఆ హయాంలో రద్దయిన 6 లక్షల ఇళ్ల స్థానంలో కూటమి ప్రభుత్వం పేదలకు న్యాయం చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచం మెచ్చే మెగా సిటీగా, క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి రూ.1.30 లక్షల కోట్ల పనులతో ప్రణాళికలు రూపొందించామని, రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తున్నామని వెల్లడించారు.ఆంధ్రప్రదేశకు కేంద్రం మంజూరు చేసిన 75 వేల ఇళ్లు సరిపోవని చెప్పగా, వెంటనే 3 లక్షల ఇళ్లకు ఆమోదం తెలిపిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు మొత్తంగా 9 లక్షల ఇళ్లు కావాలని కేంద్రాన్ని కోరగా, కేంద్రమంత్రి శివరాజ్సంగ్ చౌహాన్ పూర్తి మద్దతు ప్రకటించారని తెలిపారు. 3డి కాంక్రీట్ టెక్నాలజీతో కేవలం 3 నెలల్లోనే నాణ్యమైన ఇళ్లను నిర్మించవచ్చని వెల్లడించారు. తెనాలి నియోజకవర్గ బుర్రిపాలెం నుంచి సినీ రంగానికి సూపర్ స్టార్ కృష్ణ, రాజకీయ రంగానికి పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చారని కొనియాడారు. నిత్యావసర ధరలను అదుపు చేయడంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
పేద వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి, వారికి ఆస్తిని వారసత్వంగా అందించాలనే గొప్ప సంకల్పంతో పనిచేసిన దార్శనికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. 2014-19 హయాంలోనే పట్టణ ప్రాంతాల్లో నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కూడిన 5 లక్షల టిడ్కో ఇళ్లకు ఆయన రూపకల్పన చేశారని గుర్తుచేశారు. పేదల సంక్షేమం, భవిష్యత్తుపై చంద్రబాబుకున్న అంకితభావం, దూరదృష్టి కారణంగానే ఆయనంటే తనకు ఎంతో అభిమానమని పెమ్మసాని స్పష్టం చేశారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తూ సమాజంలో వారికి ఆత్మగౌరవాన్ని కల్పించడంలో ఏపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చామని గొప్పలు చెప్పుకుందే తప్ప, పేదలకు ఇళ్లను నిర్మించడంలో పూర్తిగా విఫలమైందని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ వ్యవస్థ సరిగ్గా ఉండి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. మన రాష్ట్ర పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని, కనీసం 6 లక్షల ఇళ్లయినా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. సభ వేదికపై కూడా కేంద్రమంత్రితో మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు చంద్రబాబు పడుతున్న తపన ప్రశంసనీయమని నాదెండ్ల పేర్కొన్నారు.