GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 8:39 am Digital Edition : GURU SWAMY

12వ పిఆర్‌సి కాలం 3 ఏళ్లు పూర్తయింది… మిగిలింది 2 ఏళ్లే : పెన్షనర్ల సంఘం డిమాండ్

పలమనేరు, ఆగస్టు 07 (గరుడ దాత్రి):
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 12వ పిఆర్‌సి గడువులో ఇప్పటికే మూడేళ్లు పూర్తయ్యాయని, కేవలం రెండేళ్ల కాలం మాత్రమే మిగిలి ఉన్నందున వెంటనే పిఆర్‌సిని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం పలమనేరులోని పెన్షనర్ల సంఘం భవనంలో అధ్యక్షుడు రత్నారెడ్డి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రత్నారెడ్డి మాట్లాడుతూ… పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల్లో తీవ్ర జాప్యం జరగడం వల్ల వారు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణీత కాలపరిమితిలోనే బకాయిలు చెల్లించాలని కోర్టులు ఆదేశిస్తున్నప్పటికీ, ప్రభుత్వాలు తాము ఇచ్చిన జివోలను తామే అమలు చేయకపోవడం ఆనవాయితీగా మారిందని విమర్శించారు. కార్యదర్శి గురుమూర్తి మాట్లాడుతూ… 12వ పిఆర్‌సి అమలు కాలంలో మూడేళ్లు గడిచినా ప్రభుత్వం ఇప్పటివరకు పిఆర్‌సి ప్రస్తావన ఎత్తకపోవడం సరికాదన్నారు. అలాగే పెన్షనర్లకు ఈహెచ్‌ఎస్ ద్వారా అరకొర వైద్యమే అందుతోందని, పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. అదే సమయంలో వేల కోట్ల రూపాయల పాత బకాయిలను చెల్లించడంతో పాటు, వేలాది మంది ఉద్యోగులను సిపిఎస్ నుండి పాత పెన్షన్ విధానంలోకి తీసుకువచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన అపోలో ఆసుపత్రి (అరగొండ శాఖ) ప్రతినిధి భానుప్రకాష్ మాట్లాడుతూ… ఈహెచ్‌ఎస్ కార్డుదారులకు చెన్నై ఆసుపత్రికి చెందిన ప్రత్యేక వైద్యులచే 30% రాయితీతో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుష్పాల వెంకటేశ్వర్లు, దొరస్వామి, బాలసుబ్రమణ్యం, పోన్ముడి, విజయకుమార్, సిద్ద మనోహర్, త్యాగరాజులు, శ్యామరాజు, కన్నయ్య, పాపయ్య, పురుషోత్తం, శేఖర్, రవిబాబు, వెంకటరమణ, సుబ్రహ్మణ్యం, లోకనాథం, లక్ష్మీనరసింహారావు, హజీజ్ సాహెబ్, బాబు సాహెబ్, ఖాదర్ బాషా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.